‘కారు’ తిరగాలనుకుంటే రాజేంద్రనగర్ ను మర్చిపోండి.. టీఆర్ఎస్ కు అసదుద్దీన్ ఒవైసీ వార్నింగ్!

09-11-2018 Fri 10:25
  • రాజేంద్రనగర్ ను వదులుకోవాల్సిందే
  • కారు స్టీరింగ్ మా చేతుల్లోనే ఉంది
  • నాలుగేళ్లుగా ఏం చేయనోళ్లు ఇప్పుడొస్తున్నారు

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది ఓ నానుడి. తాజాగా తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అధికార టీఆర్ఎస్ కు పరోక్ష హెచ్చరికలు చేశారు. రాజేంద్రనగర్ తప్ప మరెక్కడైనా టీఆర్ఎస్ పోటీ చేసుకోవాలని సూచించారు. ఎందుకంటే రాజేంద్రనగర్ లో ‘కారు’ నడవబోదనీ, దాని స్టీరింగ్ తమ చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో టీఆర్ఎస్ ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చనీ, కానీ రాజేంద్ర నగర్ లో మాత్రం అడుగుపెట్టొద్దని పరోక్షంగా హెచ్చరించారు. గత నాలుగేళ్లుగా ప్రజలను పట్టించుకోని కొందరు నేతలు ఎన్నికల నేపథ్యంలో కారులో దూసుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘కారు’ ప్రయాణాన్ని సుఖవంతం చేయాలనుకుంటే రాజేంద్రనగర్ ను తమకు ఇవ్వక తప్పదని స్పష్టం చేశారు.

తెలంగాణలో చంద్రబాబు నాయుడు పెడుతున్న కూటములు ఏవీ పనిచేయబోవని జోస్యం చెప్పారు. ఎంఐఎంను హైదరాబాద్ నుంచి తరిమివేస్తామన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై స్పందిస్తూ.. బీజేపీ ముక్త తెలంగాణ త్వరలోనే సాకారమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటులో ఎంఐఎం కీలకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.