Amit Shah: 2.40 లక్షల ఓట్లతో ఓడిపోవడమా?.. కర్ణాటక నేతలకు క్లాస్ తీసుకున్న అమిత్ షా

  • ఉప ఎన్నికల ఫలితాలపై అమిత్ షా గుర్రు
  • నేతలకు ఫోన్ చేసి క్లాస్ పీకిన జాతీయ అధ్యక్షుడు
  • లోక్‌సభ ఎన్నికల నాటికి పుంజుకోవాలని సూచన

కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రంలోని మూడు లోక్‌సభ, రెండు శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా బీజేపీ ఒక్క శివమొగ్గ స్థానంతోనే సరిపెట్టుకుంది. ఇటీవల వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న బీజేపీ దీనిని ఘోర పరాభవంగా భావించింది.

దీంతో బుధవారం ఫలితాలు వెలువడిన వెంటనే రాష్ట్ర నేతలకు ఫోన్ చేసిన అమిత్ ‌షా ఉప ఎన్నికల పరాజయంపై మండిపడినట్టు తెలుస్తోంది. తప్పకుండా గెలుస్తామనుకున్న బళ్లారి స్థానాన్ని కూడా కోల్పోవడాన్ని అవమానంగా భావించిన షా.. సమష్టితత్వం లేకే ఓటమి పాలయ్యామని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. 2.40 లక్షల ఓట్ల తేడా ఉందంటే ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్పతోపాటు పలువురు నేతలతో మాట్లాడిన షా.. లోక్‌సభ ఎన్నికల నాటికైనా బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

More Telugu News