America: బార్‌లో ఆనందంలో మునిగితేలుతున్న యువతపై తూటాల వర్షం.. 12 మంది దుర్మరణం

  • అమెరికాలో మరోమారు గర్జించిన తుపాకి
  • ఓ పోలీసు అధికారి సహా 12 మంది మృతి
  • ‘వెడ్‌నెస్‌డే పార్టీ’రక్తసిక్తం

అమెరికాలో తూటా మరోసారి యువత గుండెలను చీల్చేసింది. బార్‌లో ఆనందంతో చిందులేస్తున్న వారి శరీరాలను ఛిద్రం చేసింది. లాస్ ఏంజెలెస్ శివారులోని ఓ బార్‌లో జరిగిన కాల్పుల్లో 12 మంది మృతి చెందగా, మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని చూసిన హంతకుడు తనను తాను కాల్చుకున్నాడు.

లాస్ ఏంజెలెస్‌కు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న థౌజండ్ ఓక్స్‌లోని ‘బోర్డర్ లైన్ అండ్ గ్రిల్’లో భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 12:50 గంటలకు ఈ దారుణం జరిగింది. కాలేజీ విద్యార్థుల కోసం బార్ నిర్వాహకులు ప్రత్యేకంగా ‘వెడ్‌నెస్‌‌డే నైట్’ పార్టీని ఏర్పాటు చేశారు. వందలాదిమంది యువతీ యువకులు హాజరైన ఈ పార్టీ ఉత్సాహంగా సాగుతుండగా ఒక్కసారిగా తూటాల వర్షం కురిసింది. 28 ఏళ్ల నేవీ మాజీ ఉద్యోగి ఇయాన్ డేవిడ్ లాంగ్ తుపాకితో హోరెత్తించాడు. కాల్పులతో బార్‌లో ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి. ఏం జరిగిందో అర్థమయ్యే సరికే 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

బార్‌లోకి ప్రవేశించిన నిందితుడు డేవిడ్ తొలుత పొగబాంబు విసిరాడు. అనంతరం తుపాకి తీసి అరుస్తూ కాల్పులు జరిపాడు. దీంతో అప్పటి వరకు ఆనందంలో మునిగితేలిన వారు చెరో దిక్కుకు పరుగులు తీశారు. తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కొందరు బాల్కనీ నుంచి దూకి తప్పించుకోగా, మరికొందరు కుర్చీలతో అద్దాలు పగలగొట్టి బయటపడ్డారు. మరికొందరు బాత్రూమ్‌లలో దాక్కున్నారు.  

సమాచారం అందుకున్న పోలీసులు క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఘటనా స్థలానికి చేరుకుని బార్‌ను చుట్టుముట్టారు. వారిని గమనించిన నిందితుడు డేవిడ్ జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు బార్‌లోకి వస్తుండడంతో ఇక తప్పించుకోవడం అసాధ్యమని భావించిన డేవిడ్ తనను తాను కాల్చుకుని మృతి చెందాడు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నిందితుడి కాల్పుల వెనక ఉద్దేశం ఏమిటన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఉగ్ర కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News