Chandrababu: మీకు మసాలా కావాలి... మాకు దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కావాలి: జర్నలిస్టులతో చంద్రబాబు

  • దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ ప్రభుత్వం నాశనం చేసింది
  • మోదీ ఒకసారి ప్రధాని అయితేనే ఇలా ఉంది.. మరోసారి అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి
  • జర్నలిస్టులు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు

పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను మోదీ ప్రభుత్వం నాశనం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని మండిపడ్డారు. డాలరు మారకంతో పోల్చితే రూపాయి విలువ పాతాళానికి పడిపోయిందని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను అంటాయని, దేశంలోని రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు.

మైనార్టీలు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని కాపాడటం కోసం విపక్ష పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. బెంగళూరులో మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిలతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ మేరకు స్పందించారు.

ఎన్డీయే పాలనకు చరమగీతం పలికేందుకు, మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు దేవేగౌడ మద్దతు తనకు అవసరమని చెప్పారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, దాన్ని ఎదుర్కోవడానికి దేవేగౌడ ముందుంటారని అన్నారు. మీడియాపై కూడా ఎన్డీయే హయాంలో ఎంతో ఒత్తిడి ఉందని, జర్నలిస్టులు చాలా ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు.

మోదీ ఒకసారి ప్రధాని అయితేనే ఇలా ఉంటే... మరోసారి అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని మీడియాను ఉద్దేశించి అన్నారు. మహాకూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు బదులుగా... మీకు మసాలా వార్తలు కావాలని, తమకు ప్రజాస్వామ్యం రక్షించబడటం కావాలని చలోక్తి విసిరారు. విపక్ష నేతలందరితో కలసి చర్చించిన తర్వాత... భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. రేపు డీఎంకే అధినేత స్టాలిన్ తో భేటీ కానున్నానని తెలిపారు.

More Telugu News