Andhra Pradesh: సోమవారం నుంచి తిరిగి ప్రజాసంకల్పయాత్రలో పాల్గొననున్న వైఎస్ జగన్!

  • 12న ప్రారంభించనున్నఏపీ ప్రతిపక్ష నేత
  • ఆదివారం వైజాగ్ కు ప్రయాణం
  • కోడికత్తి దాడి నుంచి కోలుకున్న జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఈ నెల 12 నుంచి విజయనగరం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొంటారని వైసీపీ నేతలు తెలిపారు. ఇందుకోసం జగన్ వచ్చే ఆదివారం విశాఖకు బయలుదేరి వెళతారన్నారు. గాయం నుంచి జగన్ కోలుకున్నారని పేర్కొన్నారు. గత నెల 25న హైదరాబాద్ కు వెళుతున్న జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే యువకుడు కోడి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడ్డ జగన్ హైదరాబాద్ లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారు.

తాజాగా ఈ దాడి ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హతపై రేపు నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు ఈ రోజు తెలిపింది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ ఆర్పీ ఠాకూర్ కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ తరఫు న్యాయవాది వాదించారు.

అయితే విశాఖపట్నం పోలీసులకు ఏపీ ప్రతిపక్ష నేత సహకరించడం లేదని ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు. దాడి ఘటనపై సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చేందుకు సైతం జగన్ నిరాకరించారని గుర్తుచేశారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది.

More Telugu News