USA: ట్రంప్ మరో దుందుడుకు చర్య.. అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ పై వేటు!

  • ట్రంప్ సూచనతో సెషన్స్ రాజీనామా
  • తాత్కాలిక ఏజీగా మాథ్యూ నియామకం
  • ట్రంప్ కోరిక మేరకే తప్పుకుంటున్నానన్న సెషన్స్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సహచరుడిపై వేటు వేశారు. కొన్ని అంశాల్లో ట్రంప్ వ్యవహారశైలి, నిర్ణయాలను బహిరంగంగా వ్యతిరేకిస్తున్న అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ కు ఉద్వాసన పలికారు. ఆయన స్థానంలో తాత్కాలిక అటార్నీ జనరల్ గా తనకు అత్యంత నమ్మకస్తుడైన మాథ్యూ.జి.వైటేకర్ ను నియమించారు. ఈ విషయాన్ని ట్రంప్ ట్విట్టర్ లో ప్రకటించారు.

‘అమెరికా తాత్కాలిక అటార్నీ జనరల్‌గా మాథ్యూ.జి.వైటేకర్‌ను నియమిస్తున్నాం. ఈ రోజు నుంచి ఆయన తన సేవలను అందిస్తారు. ఇప్పటివరకూ అటార్నీ జనరల్‌గా సేవలందించిన జెఫ్‌ సెషన్స్‌కు ధన్యవాదాలు. ఆయనకు అంతా మంచే జరగాలని ప్రార్థిస్తున్నా. త్వరలోనే కొత్త అటార్నీ జనరల్‌ను నియమిస్తాం’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.

ఇంతకుముందు జరిగిన ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన ట్రంప్ వైట్ హౌస్ లో సీనియర్ అధికారుల మార్పులకు సంబంధించి ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశం ముగిసిన గంటలోనే జెఫ్ సెషన్స్ రాజీనామా సమర్పించారు. కాగా, ట్రంప్ కోరిక మేరకే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సెషన్స్ చెప్పడం గమనార్హం. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రష్యా సాయం తీసుకోవడంపై సీరియస్ గా విచారణ జరిపిన ఎఫ్ బీఐ చీఫ్ రాబర్ట్ ముల్లర్ సహా పలువురిని ట్రంప్ ఇటీవల సాగనంపారు.

More Telugu News