కేంద్ర పాలకుల్లో పెరుగుతున్న అసహనం.. కక్ష సాధింపునకే ఐటీ దాడులు: చంద్రబాబు

08-11-2018 Thu 11:51
  • గ్రామదర్శినిపై అధికారులతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్‌
  • స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసి వ్యవస్థల నిర్వీర్యం
  • ధరల పెరుగుదలకూ కారణం
కేంద్ర పాలకుల్లో తీవ్ర అసహనం పెరిగిపోయిందని, ప్రత్యర్థులపై కక్ష సాధింపునకు ఐటీ, ఈడీ దాడులను ఉపయోగిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. దేశంలో అశాంతి, అభద్రత నెలకొన్నాయని, ఈ పరిస్థితుల్లో దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇవాళ గ్రామదర్శినిపై ఆయా శాఖల అధికారులతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచేశారని విమర్శించారు. రూపాయి విలువ దారుణంగా పడిపోయిందన్నారు.

సీబీఐ, ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని కూడా దెబ్బ తీశారని ధ్వజమెత్తారు. తిత్లీ తుపాన్‌ సహాయక చర్యలకు తొలిరోజుల్లో కాస్త ఇబ్బంది పడినా 25 రోజుల్లో మొత్తం పరిస్థితిని చక్కదిద్దామని చెప్పారు. కేంద్రం ఒక్క పైసా సాయం చేయకున్నా రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో ఆదుకుందని తెలిపారు. అధికారులు అందుబాటులో ఉండడంతో ప్రజల భాగస్వామ్యం కూడా పెరిగి మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. నాలుగున్నరేళ్లలో టీడీపీ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని గోడ రాతల ద్వారా ప్రజలకు వివరించాలని అధికారులకు సూచించారు.