Newzeland: ఒకే ఓవర్ లో 43 పరుగులు... సాధ్యం చేసిన న్యూజిలాండ్ ఆటగాళ్లు!

  • ఓవర్ లో రెండు నోబాల్స్ వేసిన ఆటగాడు
  • ఆరు సిక్సులు, ఒక ఫోర్, ఒక సింగిల్
  • నోబాల్స్ కు ఎక్స్ ట్రా పరుగులు కలిపి 43 పరుగులు

ఒకే ఓవర్ లో 43 పరుగులు ఎలా సాధ్యం? ఆరు బాల్స్ కు ఆరు సిక్సులు కొట్టినా 36 పరుగులేగా వచ్చేది? నోబాల్స్ ఏమైనా వేశారా? ఎన్ని వేశారు? 43 పరుగులు ఎలా సాధ్యమనే అనుమానం వచ్చిందా? మీరు అనుకున్నది నిజమే... నోబాల్స్ పడ్డాయి. న్యూజిలాండ్ దేశవాళీ వన్డే మ్యాచ్ లో ఇది సాధ్యమైంది. సెంట్రల్‌ డిస్ట్రిక్‌, నార్త్ రన్ డిస్ట్రిక్‌ మధ్య మ్యాచ్ జరుగగా, నార్త్ రన్ బ్యాట్స్‌మెన్‌ జో కార్టర్‌, బ్రెట్‌ హంప్టన్‌ ఈ అద్భుతాన్ని సృష్టించి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సరికొత్త రికార్డును సృష్టించారు. వీరిద్దరి విధ్వంసానికి సెంట్రల్‌ డిస్ట్రిక్ట్‌ పేసర్‌ విలియమ్‌ లుడిక్‌ బలయ్యాడు.

లుడిక్‌ వేసిన ఓవర్‌లో 4, 6 (నోబాల్), 6 (నోబాల్), 6, 1, 6, 6, 6... ఇవి వారిద్దరూ కలసి సాధించిన పరుగులు. దీంతో ఒక ఓవర్ లో 43 పరుగులు సాధించిన జంటగా వీరిద్దరూ నిలిచారు. ఇదే సమయంలో ఆరు బంతుల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న తొలి బౌలర్ గా లుడిక్‌ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో నార్తెర్న్‌ డిస్ట్రిక్ట్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేయగా, సెంట్రల్‌ డిస్ట్రిక్ట్ జట్టు 288 పరుగులకే పరిమితమైంది. నార్తెర్న్‌ డిస్ట్రిక్ట్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది.




More Telugu News