Stock markets: స్టాక్ మార్కెట్లో దీపావళి కాంతులు.. ముూరత్ ట్రేడింగ్‌లో లాభాల పంట!

  • సాయంత్రం 5:30 నుంచి గంటపాటు మూరత్ ట్రేడింగ్
  • గంట కొట్టి ప్రారంభించిన నటి  నీతూచంద్ర
  • డెమోక్రాట్ల గెలుపుతో ఉత్సాహంగా అమెరికా మార్కెట్లు

దీపావళి రోజున స్టాక్ మార్కెట్ తారాజువ్వలా నింగికెగిసింది. పండుగ ఊపు మార్కెట్‌లో కనిపించింది. షేర్లు అమాంతం పెరిగి లాభాలు తెచ్చిపెట్టాయి. సినీ నటి నీతూ చంద్ర గంట కొట్టి మూరత్ ట్రేడింగ్‌ను ప్రారంభించగా,  సాయంత్రం 5:30 నుంచి 6:30 గంటల వరకు ట్రేడింగ్ జరిగింది. మార్కెట్ సూచీలు తొలి నుంచి లాభాల్లోనే కదిలాయి.

ఆటోమొబైల్, ఐటీ షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు రెండు శాతం, టాటా మోటార్స్ షేర్లు 1.1 శాతం, హీరో మోటాకార్ప్ షేర్లు 1.5 శాతం లాభపడ్డాయి. సెన్సెక్స్ 241 పాయింట్ల లాభంతో 35,233 వద్ద ముగియగా, నిఫ్టీ 75 పాయింట్ల లాభంతో 10,605 వద్ద ముగిసింది.

 గత దీపావళి నుంచి మంగళవారం వరకు చూసుకుంటే సెన్సెక్స్ 2,407.56 (7శాతం) పెరగ్గా, నిఫ్టీ 319.15 పాయింట్లు (3 శాతం) పెరిగింది. మరోవైపు, అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల గెలుపు కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది. ముఖ్యంగా అమెరికా మార్కెట్లలో ఉత్సాహం కనిపించింది. మరోవైపు చమురు ధరలు కుదుటపడడం కూడా మార్కెట్‌కు కలిసి వచ్చింది.

More Telugu News