Australia: డ్రైవర్ లేకుండా 92 కిలోమీటర్లు పరుగులు తీసిన గూడ్సు రైలు!

  • రైలు పొడవు మూడు కిలోమీటర్లు
  • నాలుగు ఇంజిన్లు, 268 వ్యాగన్లు
  • ఆస్ట్రేలియాలో ఘటన

దాదాపు మూడు కిలోమీటర్ల పొడవున్న గూడ్సు రైలు డ్రైవర్ లేకుండా ఏకంగా 92 కిలోమీటర్లు ప్రయాణించింది. చివరికి ఎలాగోలా దానిని నియంత్రించినా అప్పటికే జరగరాని నష్టం జరిగింది. కొన్ని వ్యాగన్లు పట్టాలు తప్పడంతో 1500 మీటర్ల మేర పట్టాలు ధ్వంసమయ్యాయి. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది.

నాలుగు ఇంజిన్లు, 268 వ్యాగన్లు ఉన్న ఈ రైలు ఇనుప రజనును మోసుకెళ్తోంది. సోమవారం పశ్చిమ ఆస్ట్రేలియాలోని న్యూమన్ నుంచి పోర్ట్ హెడ్‌ల్యాండ్‌కు బయలుదేరింది. గమ్యానికి మరో 210 కిలోమీటర్ల దూరంలో ఉండగా తెల్లవారు జామున 4:40 గంటలకు రైలు ఆపిన డ్రైవర్ కిందికి దిగి వ్యాగన్‌ను పరీక్షిస్తుండగా అకస్మాత్తుగా ముందుకు పరుగులు తీసింది.

అలా అలుపెరగకుండా పరుగులు తీసిన రైలు 92 కిలోమీటర్లు ప్రయాణించింది. ఎట్టకేలకు ఉదయం 5:05 గంటల సమయంలో అధికారులు రైలును నియంత్రించారు. అయితే అప్పటికే కొన్ని వ్యాగన్లు పట్టాలు తప్పాయి.  అందులోని ఇనుప రజను పట్టాలపై చిందరవందరగా పడింది. 1500 మీటర్ల ట్రాక్ ధ్వంసమైంది. అయితే, ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News