వైసీపీ నుంచి బయటకు వచ్చింది అందుకే!: మంత్రి ఆదినారాయణరెడ్డి

07-11-2018 Wed 17:45
  • కత్తికోడి ఎపిసోడ్ సినిమా క్రియేషన్‌లా ఉంది
  • జగన్‌ను చాలా దగ్గరి నుంచి చూశా
  • తప్పని చెప్పినందుకు పక్కనపెట్టారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తానెందుకు బయటకు వచ్చిందీ ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి వెల్లడించారు. జగన్‌ను తాను చాలా దగ్గరి నుంచి చూశానని, కొన్ని విషయాల్లో ఆయన తప్పుగా వ్యవహరిస్తుండడంతో అది తప్పని చెప్పినందుకు తనను పక్కనపెట్టారని అన్నారు. తనను పక్కనపెట్టినందుకే పార్టీ నుంచి బయటకు వచ్చినట్టు వివరించారు.

ఇటీవల విశాఖపట్టణంలో జగన్‌పై జరిగిన కత్తి దాడిపై మాట్లాడుతూ.. అదో కత్తికోడి ఎపిసోడ్ సినిమా క్రియేషన్‌లా ఉందని ఎద్దేవా చేశారు. కడపను నీతి ఆయోగ్ వెనకబడిన జిల్లాగా పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరో నెలలోనే కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం ప్రారంభం అవుతుందన్నారు. రూ.1500 కోట్లతో నిర్మాణాన్ని మొదలుపెట్టబోతున్నట్టు చెప్పారు. ఈ విషయంలో కేంద్రం సహకరిస్తే చాలా మంచిదని, లేదంటే రాష్ట్ర ప్రభుత్వమే పరిశ్రమను ప్రారంభిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.