Congress: అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ మల్లగుల్లాలు.. పది సీట్ల విషయంలో వీడని చిక్కుముడి!

  • ఒక్కో స్థానంలో ఇద్దరుముగ్గురు ఆశావహులు
  • స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో వాడివేడి వాదనలు
  • మరికొన్ని గంటల్లో ఓ కొలిక్కి వచ్చే అవకాశం

అభ్యర్థుల ప్రకటన విషయంలో కాంగ్రెస్ ఇంకా తుది నిర్ణయానికి రాలేకపోతోంది. పోలింగ్ సమయం దగ్గర పడుతున్నా ఇంకా అభ్యర్థుల ఎంపికకే పరిమితం కావడంతో నేతలను తీవ్రంగా కలవరపెడుతోంది. ముఖ్యంగా ఓ పది సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వర్గాల నుంచి వేర్వేరు ప్రతిపాదనలు రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరుకి మించి అభ్యర్థులు పోటీ పడుతుండడంతో ఎవరిని ఖరారు చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతోంది. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఈ విషయమై వాడివేడి చర్చ జరిగినట్టు సమాచారం.  

ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్న నియోజకవర్గాల్లో.. ఎల్లారెడ్డి, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, మంచిర్యాల, సూర్యాపేట, ఇల్లందు, దేవరకొండ ఉన్నాయి. ఎల్లారెడ్డిలో పైలా కృష్ణారెడ్డి, సుభాష్‌రెడ్డి, నల్లమడుగు సురేందర్ రెడ్డి పోటీలో ఉండగా, బాల్కొండ నుంచి అనిల్, రాజారామ్ యాదవ్ పోటీపడుతున్నారు. వెంకటేశ్వరరెడ్డి, భూపతి రెడ్డి నిజామాబాద్ రూరల్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.

ఇక, నిజామాబాద్ అర్బన్ నుంచి మహేశ్ గౌడ్, అరికెల నర్సారెడ్డి, మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్ రావు, అరవింద్ రెడ్డి, సూర్యాపేట నుంచి పటేల్ రమేశ్ రెడ్డి, దామోదర్ రెడ్డి, ఇల్లందు నుంచి హరిప్రియ, అబ్బయ్య, దేవరకొండ నుంచి బిల్యానాయక్, జగన్ టికెట్ కోసం ఎదురుచూస్తున్నారు. కాగా,  రేపు జరగనున్న కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో అభ్యర్థుల తుది జాబితా ఖరారు కానుంది.

More Telugu News