Telangana: సీపీఐ కార్యాలయానికి కోదండరాం.. కమ్యూనిస్టులతో సుదీర్ఘ చర్చలు!

  • కూటమి తరఫున మధ్యవర్తిత్వానికి రాలేదు
  • కాంగ్రెస్ నేతలతో మాట్లాడాక తుది నిర్ణయం
  • సీపీఐ ఆలోచన తెలుసుకునేందుకే ఆఫీసుకు వచ్చా

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టడానికి కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీలు ప్రజా కూటమిగా ఏర్పడ్డ సంగతి తెలిసిందే. అయితే సీట్ల పంపకం విషయంలో ఇంకా స్పష్టత రాకపోవడంతో అన్ని పార్టీల్లోనూ గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ జనసమితి(టీజేఎస్) అధినేత ప్రొ.కోదండరాం ఈ రోజు సీపీఐ తెలంగాణ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ, సీట్ల పంపకంలో కాంగ్రెస్ సాగతీత ధోరణిపై ఇరుపక్షాల నేతలు చర్చించినట్లు సమాచారం

మహాకూటమిలో కొనసాగాలా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కోరినన్నీ సీట్లను కేటాయించకుంటే బయటకు వచ్చి పోటీ చేయాలా? అన్న విషయాలపై ఇరు పక్షాల నేతలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మరోవైపు సమావేశం అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ.. సీపీఐతో మధ్యవర్తిత్వం చేయడానికి తానిక్కడకు రాలేదని స్పష్టం చేశారు.

ప్రజాకూటమి విషయమై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అన్నారు. సీపీఐ నేతల ఆలోచన ఏంటో తెలుసుకునేందుకే ఈ రోజు పార్టీ ఆఫీసుకు వచ్చానన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీలో ఉన్నారనీ వాళ్లతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

More Telugu News