Cricket: కైఫ్ కు పొగరెక్కువ.. జడేజాకు క్రమశిక్షణ నేర్పడానికి చుక్కలు కనిపించాయి!: ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వార్న్

  • ఆత్మకథ నో స్పిన్ లో ప్రస్తావించిన వార్న్
  • మునాఫ్ పటేల్ హాస్య ప్రియుడని వెల్లడి
  • ఒక్క దెబ్బతో జడేజాను మార్చామని వ్యాఖ్య

2007లో భారత్ లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో రాజస్తాన్ రాయల్స్ జట్టు విజేతగా నిలిచింది. ఎలాంటి స్టార్ ఆటగాళ్లు లేకుండా కేవలం షేన్ వార్న్ నాయకత్వంలో రంగంలోకి దిగిన రాజస్తాన్ ఫైనల్స్ లో చెన్నైసూపర్ కింగ్స్ ను చిత్తుగా ఓడించింది. ఈ నేపథ్యంలో ‘నో స్పిన్’ పేరుతో తన ఆత్మకథను రాసిన షేన్ వార్న్ ఐపీఎల్ సందర్భంగా తనకు ఎదురైన చిత్రవిచిత్ర అనుభవాలను పంచుకున్నాడు. ముఖ్యంగా భారత క్రికెటర్లు మొహమ్మద్ కైఫ్, రవీంద్ర జడేజా, మునాఫ్ పటేల్ ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు.

మొహమ్మద్ కైఫ్ కు తాను సీనియర్ క్రికెటర్ ను అన్న అహంభావం ఎక్కువని షేన్ వార్న్ ఆత్మకథలో తెలిపాడు. ‘రాజస్తాన్‌ జట్టు హోటల్‌లోకి దిగాక ఆటగాళ్లు అందరూ ఎవరి గదుల్లోకి వారు వెళ్లిపోయారు. అయితే మొహమ్మద్ కైఫ్‌ మాత్రం రిసెప్షన్‌ వద్దకు వెళ్లి నా పేరు కైఫ్‌ అని చెప్పాడు. ‘ఆమె నాకు తెలుసు సార్’ అని జవాబిచ్చింది. ఆ తర్వాత కూడా మరోసారి నా పేరు కైఫ్‌ అని ఆమెకు గుర్తు చేశాడు. దీంతో నేను అక్కడకు వెళ్లి ఏమైనా సమస్య ఉందా? అని అడిగాను. వెంటనే కైఫ్ స్పందిస్తూ.. అవును, నా పేరు కైఫ్‌ అని ఇంకోసారి చెప్పాడు.

నువ్వెవరో వాళ్లకు తెలుసులే. ఇప్పుడు నీ ఇబ్బంది ఏంటి? అని అడిగా. అందరిలాగే నాకు చిన్న గది ఇచ్చారు. నా పేరు కైఫ్‌ అని మళ్లీ చెప్పాడు! దాంతో అతని ఉద్దేశం ఏమిటో నాకు అర్థమైంది. తాను భారత జట్టులో సీనియర్ ఆటగాడు కాబట్టి తనకు కూడా పెద్ద గది ఇవ్వాలన్నది అతని ఉద్దేశమని నాకు అర్థమయింది. దీంతో ’ఎక్కువగా ఆలోచించవద్దు. అందరు ఆటగాళ్లకు ఒకే తరహా గది ఇచ్చారు. నేను ఎక్కువ మందితో కలవాల్సి ఉంటుంది కాబట్టి నాకు పెద్ద గది కేటాయించారు’ అని నేను చెప్పడంతో అతను సైలెంట్ గా వెళ్లిపోయాడు.

ఇక మునాఫ్ పటేల్ ను ఓసారి నీ వయస్సు ఎంత? అని ప్రశ్నించగా.. అసలు వయసా? లేకా ఐపీఎల్ లో వయసా? అంటూ వ్యంగ్యంగా ఎదురు ప్రశ్నించాడని గుర్తుచేసుకున్నాడు. తన వయసు 34 సంవత్సరాలు అయినా ఐపీఎల్ లో ఛాన్సుల కోసం 24 అనే చెబుతానంటూ జోక్ చేశాడన్నారు. ఇక జడేజాను క్రమశిక్షణలో పెట్టడం తన తలకు మించిన భారమయిందని వార్న్ తెలిపాడు.

ప్రయాణం, శిక్షణ ఏదయినా సరే జడేజా ఎప్పుడూ ఆలస్యంగా వచ్చేవాడని వార్న్ వెల్లడించాడు. ‘జడేజాను క్రమశిక్షణలో పెట్టడానికి ఓసారి హోటల్ కు తిరిగివస్తూ బస్సునుంచి దించేశాం. అక్కడి నుంచి నడుస్తూ రమ్మని శిక్ష విధించాను. అప్పటి నుంచి అంతా మారిపోయింది. జడేజా ఆలస్యంగా రావడాన్ని పూర్తిగా మానేశాడు’ అంటూ అప్పటి అనుభవాలను గుర్తుచేసుకున్నాడు.

More Telugu News