Gujarat: గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యాను చంపింది నయీమే.. కోర్టుకు తెలిపిన ఆజంఖాన్

  • 15 ఏళ్ల క్రితం హరేన్ పాండ్యాను కాల్చి చంపిన దుండగులు
  •  ఆయనను ఎవరు చంపారన్నది ఇప్పటికీ మిస్టరీనే
  • సంచలనం సృష్టిస్తున్న ఆజంఖాన్ వ్యాఖ్యలు

గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యాను హత్య చేసింది గ్యాంగ్‌స్టర్ నయీమేనని ఉదయ్‌పూర్ గ్యాంగ్‌స్టర్  ఆజంఖాన్ సీబీఐ కోర్టుకు తెలిపాడు. ముంబై సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణలో అతడీ విషయం చెప్పినట్టు తెలుస్తోంది. సోహ్రబుద్దీన్ తనకు స్నేహితుడని పేర్కొన్నాడు. ఓసారి సోహ్రబుద్దీన్ తనతో మాట్లాడుతూ గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యను హత్య చేసే కాంట్రాక్టు వచ్చినట్టు చెప్పాడని తెలిపాడు. నయీం, అతడి అనుచరుడు షాహిద్‌తో కలిసి ఆ పని పూర్తి చేస్తానని అతడు చెప్పగానే తనకు చాలా బాధ అనిపించిందని పేర్కొన్నాడు. డీజీ వంజారానే ఈ హత్యకు కాంట్రాక్టు ఇచ్చినట్టు చెప్పడంతో తాను ఆశ్చర్యపోయానని, ఆ తర్వాత సోహ్రబుద్దీన్‌తో సంబంధాలను తెంచుకున్నానని ఆజంఖాన్ కోర్టుకు తెలిపాడు.

సోహ్రబుద్దీన్ ఆదేశాల మేరకు తులసీరామ్ ప్రజాపతి, మరొకరు కలిసి హరేన్ పాండ్యాను హత్య చేసినట్టు 2010లో తాను సీబీఐకి చెప్పానని, అయితే.. అలా చెప్పడం వల్ల లేనిపోని గందరగోళం ఏర్పడుతుందని ఓ అధికారి తనతో చెప్పినట్టు ఆజంఖాన్ వివరించాడు. సీబీఐ స్టేట్‌మెంట్‌లో ఈ విషయాన్ని చేర్చకపోవడం వెనక ఉన్న కారణం ఇదేనని, అంతకుమించేమీ లేదని తేల్చి చెప్పాడు. హరేన్ పాండ్యా హత్య జరిగి 15 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ఆయనను చంపిందెవరో తేలలేదు. ఈ నేపథ్యంలో ఆజంఖాన్ తాజాగా కోర్టులో చెప్పిన విషయాలు సంచలనంగా మారాయి.  

More Telugu News