serilingampalli: శేరిలింగంపల్లి టీడీపీ లొల్లి.. భవ్య ఆనంద్ ప్రసాద్ పై దాడి గురించి మొవ్వా స్పందన

  • కార్యకర్తలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆనంద్ ప్రసాద్ ప్రచారం చేస్తున్నారు
  • అడిగేందుకు వెళ్లిన కార్యకర్తలకు గౌరవం కూడా ఇవ్వలేదు
  • రాళ్లు, చెప్పులతో బెదిరించడం వల్లే వివాదం ఏర్పడింది
  • అధిష్ఠానం ఎవరికి టికెట్ ఇచ్చినా... గెలుపు కోసం పని చేస్తాం
  • చిన్న విషయాన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం జరుగుతోంది

తెలంగాణలో టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో శేరిలింగంపల్లి ఒకటి. ఈ నేపథ్యంలో, ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు టీడీపీలో పోటీ ఎక్కువగానే ఉంది. మరోవైపు, టీడీపీ తరపున మొవ్వా సత్యనారాయణ, భవ్య ఆనంద్ ప్రసాద్ లు ఎవరికివారే ఇప్పటికే భారీ ఎత్తున ప్రచారం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాలకు మధ్య ఘర్షణ చెలరేగి, దాడి చేసుకునేంత వరకు వెళ్లడం కలకలం రేపుతోంది.

ఈ నేపథ్యంలో మొవ్వా మాట్లాడుతూ, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు లేవని, కార్యకర్తల మధ్య జరిగిన చిన్న విషయాన్ని మీడియా ద్వారా రాద్ధాంతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. పార్టీలో అంకితభావంతో పని చేసే కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారని... గత 20 రోజుల నుంచి అధిష్ఠానం తనకు టికెట్ కేటాయించిందని చెప్పుకుంటూ, ప్రచార రథాలు, కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని... ఆనంద్ ప్రసాద్ ప్రచారం చేసుకుంటున్నాని అన్నారు. దీనిని గమనించిన పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు కొంతమంది... విషయాన్ని ఆరా తీసేందుకు యత్నించారని చెప్పారు. ఆయన కోసం నాలుగు గంటల సేపు ఎదురు చూశారని... ఆయన రాకుండా ఇతరులను పంపించడంతో నేతలు, కార్యకర్తలు అసహనానికి గురయ్యారని తెలిపారు.

కార్యకర్తలకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా బైక్ ర్యాలీ నిర్వహిస్తుండటంతో... అడగడానికి కొందరు వెళ్లారని మొవ్వా తెలిపారు. కానీ, సీనియర్ కార్యకర్తలకు గౌరవం కూడా ఇవ్వకుండా... 'బండి పోనియండి' అంటూ ముందుకు వెళ్లడంతో... కార్యకర్తలు ర్యాలీని అడ్డుకున్నారని చెప్పారు. ఆ సమయంలో రాళ్లు, చెప్పులతో బెదిరించడంతోనే వివాదం ఏర్పడిందని, అంతకు మించి ఎలాంటి సమస్య లేదని తెలిపారు. పార్టీ టికెట్ ఎవరికి వచ్చినా, పార్టీని గెలిపించేందుకు అందరం కృషి చేస్తామని చెప్పారు. ఆనంద్ ప్రసాద్ కూడా టీడీపీ అభిమానే అని... కానీ, సమాచారం కూడా ఇవ్వకుండా ప్రచారాన్ని చేపట్టడం వల్లే ఈ ఘటన జరిగిందని తెలిపారు.

More Telugu News