kumaraswamy: ఇది ట్రైలర్ మాత్రమే... 2019లో అసలైన సినిమా చూపిస్తాం: కుమారస్వామి

  • ఈ గెలుపు ప్రజలకు మాపై ఉన్న నమ్మకానికి నిదర్శనం
  • రాష్ట్రాన్ని క్లీన్ స్వీప్ చేయడమే మా లక్ష్యం
  • కూటమి బతకలేదన్న బీజేపీ నేతలు.. ఇప్పుడేం చెబుతారు?

కర్ణాటక ఉపఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఘన విజయం సాధించడంపై ముఖ్యమంత్రి కుమారస్వామి ఆనందం వ్యక్తం చేశారు. ఇది కేవలం తొలి అడుగు మాత్రమేనని... 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి చుక్కలు చూపిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 28 లోక్ సభ స్థానాలు ఉన్నాయని... కాంగ్రెస్ పార్టీతో కలసి అన్ని స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు గెలిచాం కాబట్టి తాను ఈ మాటలు అనడం లేదని... తమపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని చెప్పారు.

కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నేతలందరినీ అభినందిస్తున్నానని కుమారస్వామి తెలిపారు. ఇంతటి ఘన విజయానికి కారణమైన జేడీఎస్ నేతలను, కార్యకర్తలను కూడా అభినందిస్తున్నానని అన్నారు. జేడీఎస్-కాంగ్రెస్ లది అపవిత్ర కలయిక అని వ్యాఖ్యానించిన బీజేపీకి... ఈ ఫలితాలు చెంపపెట్టువంటివని చెప్పారు. తమ కూటమి ఎంతో కాలం బతకదని ఎద్దేవా చేసిన బీజేపీ నేతలు... ఈ ఫలితాల తర్వాత ఏం మాట్లాడతారని అన్నారు. రాష్ట్రాన్ని క్లీన్ స్వీప్ చేయడమే తమ కూటమి తదుపరి లక్ష్యమని చెప్పారు.

టిప్పు సుల్తాన్ జయంతిని నిర్వహించాలని కానీ, నిర్వహించకూడదని కానీ తాను ఎన్నడూ అనలేదని కుమారస్వామి తెలిపారు. దేశంలో ఎన్నో సామాజికవర్గాలు ఉన్నాయని... వాళ్ల నేతల జయంతులను వివిధ వర్గాల ప్రజలు నిర్వహించుకోవడం సాధారణ విషయమేనని చెప్పారు. బీజేపీవాళ్లు ఈ ఉత్సవాల్లో భాగం కాకూడదని భావిస్తే... వారు దూరంగా ఉండవచ్చని సూచించారు.

More Telugu News