karnataka: బీజేపీ కంచుకోట బద్దలు.. బళ్లారిలో దాదాపు రెండున్నర లక్షల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ ఘన విజయం

  • బళ్లారిలో 2,43,161 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం
  • మండ్యలో 3 లక్షలకు పైగా మెజార్టీతో జేడీఎస్ జయకేతనం
  • ఐదు స్థానాల్లో నాలుగు చోట్ల బీజేపీ ఓటమి

కర్ణాటక ఉపఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ కంచుకోట, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి సామ్రాజ్యమైన బళ్లారిలో ఆ పార్టీకి దిమ్మతిరిగే ఫలితం ఎదురైంది. బళ్లారి లోక్ సభకు జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి వీఎస్ ఉగ్రప్ప ఏకంగా 2,43,161 ఓట్ల తేడాతో బీజేపీని మట్టికరిపించారు. మండ్య పార్లమెంటు స్థానంలో జేడీఎస్ అభ్యర్థి శివరామేగౌడ 3,24,943 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.

ఇక శివమొగ్గ పార్లమెంటు స్థానంలో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర 52,148 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రామనగరం, జామ్ ఖండి అసెంబ్లీ స్థానాలను కూడా కాంగ్రెస్-జేడీఎస్ కూటమి కైవసం చేసుకుంది. మొత్తం మీద 5 స్థానాలకు జరిగిన ఉపఎన్నికలలో... కూటమి నాలుగు స్థానాల్లో విజయదుందుభి మోగించగా... బీజేపీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే గెలిచింది. ఈ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్-జేడీఎస్ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది. 

More Telugu News