Yadadri Bhuvanagiri District: "మీటింగ్ కు వస్తే 300 ఇస్తారంటహో..." యాదాద్రి జిల్లాలో టముకేసి మరీ పిలుస్తున్న పెద్దలు!

  • లింగరాజుపల్లి గ్రామంలో ఘటన
  • వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన వ్యక్తి
  • ముగ్గురిపై కేసు నమోదు

ఓ పార్టీ పెట్టనున్న సమావేశానికి వస్తే రూ. 300 ఇస్తారని టముకు వేయించి ప్రచారం చేస్తుండటం, దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా, అది వైరల్ కావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, తెలంగాణలోని యాదాద్రి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం లింగరాజుపల్లి గ్రామంలో, "యాదగిరి గుట్టలో జరిగే మీటింగ్‌ కు వస్తే 300 రూపాయలు ఇస్తారంటహో.." అంటూ లింగరాజుపల్లి గ్రామానికి చెందిన వృద్ధుడు ఎడ్లకాడి వెంకటయ్య దండోరా వేశాడు.

దీన్ని ఓ వ్యక్తి వీడియో తీయగా, అది వైరల్ అయింది. దీంతో తహసీల్దార్ జ్యోతి వెంకటయ్యను విచారించి, అతని వాంగ్మూలాన్ని నమోదు చేశారు. రేషన్ వచ్చిందని గ్రామంలో టముకు వేసి వెళుతుండగా, ఎర్ర కృష్ణారెడ్డి తండ్రి మోహన్‌ రెడ్డి వచ్చి, యాదగిరిగుట్టలో తమ మీటింగ్ కు వస్తే, రూ.300 ఇస్తామని దండోరా వేయమని చెప్పాడు. కృష్ణారెడ్డి చెప్పిన ప్రకారం వెంకటయ్య  గ్రామంలో దండోరా వేశాడు.

అయితే, అక్కడే ఉన్న ఎర్ర రాజేందర్‌రెడ్డి అనే వ్యక్తి, మళ్లీ చెప్పాలని కోరి, దాన్ని వీడియో తీశాడు. దీంతో మీటింగ్‌ కు వస్తే డబ్బులిస్తామని దండోరా వేయించిన కృష్ణారెడ్డి, చాటింపు వేసిన వెంకటయ్య, సెల్‌ ఫోన్‌ లో రికార్డు చేసిన రాజేందర్‌ రెడ్డిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News