gautam gambhir: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలున్న వ్యక్తి గంట కొట్టడమా?.. అజారుద్దీన్‌పై గంభీర్ సంచలన వ్యాఖ్యలు

  • అజార్‌పై జీవితకాల నిషేధం విధించిన బీసీసీఐ
  • ఈడెన్ గార్డెన్స్‌లో గంట మోగించడాన్ని తప్పుబట్టిన గంభీర్
  • గంభీర్ ట్వీట్‌పై మిశ్రమ స్పందన

టీమిండియా మాజీ సారథి, భారత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన మహమ్మద్ అజారుద్దీన్‌పై టీమిండియా క్రికెటర్ గౌతం గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఈడెన్ గార్డెన్స్‌లోని బెల్‌ను మోగించడమేంటని మండిపడ్డాడు.

ఇంతకీ ఏమైందంటే.. కోల్‌కతాలోని ప్రతిష్ఠాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో ఏదైనా మ్యాచ్ ప్రారంభానికి ముందు గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన గంట మోగించడం ఆనవాయతీ. ఆదివారం భారత్-విండీస్ మధ్య జరిగిన తొలి టీ20కి ముందు అజారుద్దీన్‌ గంట మోగించి మ్యాచ్‌ను ప్రారంభించాడు. దీనిని గౌతం గంభీర్ తీవ్రంగా తప్పుబడుతూ ట్వీట్ చేశాడు.

‘‘ఈ రోజు భారత్ గెలిచింది. కానీ బీసీసీఐ, సీవోఏ, సీఏబీ మాత్రం ఓడిపోయాయి. అవినీతి వ్యతిరేక పాలసీకి ఆదివారం మంగళం పాడారు. హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ పడే అవకాశం అతడికి (అజార్) ఇచ్చారని తెలుసు. కానీ బెల్ మోగించే అవకాశం కూడా ఇవ్వడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది’’ అని గంభీర్ ట్వీట్ చేశాడు.

గంభీర్ ట్వీట్‌ను కొందరు ప్రశంసిస్తుండగా, మరికొందరు విమర్శిస్తున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అజార్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

More Telugu News