Visakhapatnam District: లాకరా.. నగల షాపా?: మోటారు ఇన్‌స్పెక్టర్ బ్యాంకు లాకర్ల నుంచి బయటపడుతున్న కిలోల కొద్దీ బంగారం!

  • నివ్వెరపోయిన ఏసీబీ అధికారులు
  • గుట్టలుగుట్టలుగా బయటపడిన బంగారు నగలు
  • నేడు మరికొన్ని లాకర్లను తెరవనున్న ఏసీబీ

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన విశాఖపట్టణం అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) శరగడం వెంకటరావుకు చెందిన బ్యాంకు లాకర్లను సోమవారం తెరిచిన ఏసీబీ అధికారులకు మూర్ఛ వచ్చినంత పనైంది. నగరంలోని మురళీనగర్‌లో ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 2, ఉర్వశి ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఒకటి, మర్రిపాలెం విశాఖ కో ఆపరేటివ్ బ్యాంకులో ఒకటి, అక్కయ్యపాలెంలోని గౌరీ కోఆపరేటివ్ బ్యాంకులో ఒకటి చొప్పున ఉన్న లాకర్లను అధికారులు గుర్తించారు. వీటిలో మూడు లాకర్లను తెరిచిన అధికారులు ఆశ్చర్యపోయారు. ఒక్కో దాంట్లో నుంచి కిలోల కొద్దీ బంగారం బయటపడింది. ఇంకా చెప్పాలంటే ఓ నగల దుకాణాన్నే ఆయన లాకర్లలో పెట్టేశాడు.

బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలోని రెండు లాకర్లలో మొత్తం 1.8 కిలోలు, ఎస్‌బీఐ లాకర్‌లో 1.3 కిలోల బంగార వస్తువులు బయటపడ్డాయి. 10కిలోల వెండి వస్తువులు కూడా వెలుగుచూశాయి. నేడు మిగిలిన రెండు లాకర్లను తెరిచే అవకాశం ఉంది. బయటపడిన బంగారు వస్తువుల్లో నెక్లెస్‌లు, గాజులు, చెవి రింగులు, ఉంగరాలు, ముక్కుపుడకలు, జడపాయలు, వడ్డాణం, దండవంకీలు, హారాలు, గొలుసులు.. ఉన్నాయి.

ఇవి కాకుండా 400 గజాల ఖాళీ స్థలం, మరో రెండు ఫ్లాట్లకు సంబంధించిన పత్రాలు కూడా లాకర్లలో లభ్యమయ్యాయి. ఈ సోదాల్లో మొత్తం మూడు కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి వస్తువులను అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వెంకటరావు, ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితుల ఇళ్లపై గత శనివారం ఏసీబీ అధికారులు  సోదాలు జరిపారు.

More Telugu News