ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో జగన్, పవన్ ఎటు వైపో చెప్పాలి: డొక్కా మాణిక్యవరప్రసాద్

05-11-2018 Mon 15:33
  • దేశంలో అన్ని వ్యవస్థలను మోదీ భ్రష్టు పట్టించారు
  • వైసీపీ, జనసేన నాయకులు నోరు మెదపడంలేదు 
  • అభివృద్ధి పనులు ఎవరు చేస్తున్నారనేది ప్రజలు తేలుస్తారు

దేశంలో అన్ని రాజ్యాంగ వ్యవస్థలను ప్రధాని మోదీ భ్రష్టు పట్టించారని ఏపీ ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ విమర్శించారు. యుద్ధ విమానాల కొనుగోలు విషయంలోనేకాక అన్ని రాజ్యాంగబద్ధ వ్యవస్థలను భ్రష్టు పట్టించి, ప్రధాని మోదీ చారిత్రక తప్పుచేశారని ఆయన సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా అడ్డుకుంటోందని డొక్కా ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంటే వైసీపీ, జనసేన నాయకులు నోరు మెదపడం లేదని ఆయన మండిపడ్డారు. మోదీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంలో వైసీపీ, జనసేన మోదీకి వ్యతిరేకమా? కాదా? అని డొక్కా ప్రశ్నించారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంలో వైసీపీ, జనసేన ఎటువైపో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలకు వ్యతిరేకంగా మోదీ పాలన సాగుతోందని డొక్కా విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఎవరు చేస్తున్నారనేది ఎన్నికల్లో ప్రజలు తేలుస్తారని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసే అన్యాయంపై వైసీపీ, జనసేన నేతలు ఇప్పటికైనా తమ వైఖరి తెలపాలని డొక్కా డిమాండ్ చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో వారి వైఖరి స్పష్టం చేయాలని డొక్కా డిమాండ్ చేశారు.