Andhra Pradesh: ఏపీ పోలీసులు, ఇంటెలిజెన్స్ దున్నపోతు నుంచి పాలు పితుకుతున్నారా?: వైసీపీ నేత రోజా ధ్వజం

  • సీఎంపై కూడా దాడి జరుగుతుందని శివాజీ చెప్పాడు
  • అతనిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు
  • శివాజీనే ఏపీ డీజీపీగా పెట్టండి

నటుడు శివాజీ చెప్పిన ‘ఆపరేషన్ గరుడ’ వ్యవహారంపై వైసీపీ నేత రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శివాజీ చెప్పినవి చెప్పినట్లు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. సీఎంపై దాడి జరుగుతుందని కూడా శివాజీ చెప్పాడన్నారు. అలాంటి వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా.. ఏపీ పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు దున్నపోతు నుంచి పాలు పితుకుతున్నారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
 
డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావులను చంద్రబాబు పక్కన కూర్చోబెట్టుకుని ‘ఆపరేషన్ గరుడ’పై మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఈ మీడియా సమావేశంతో డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీలు చేతకాని దద్దమ్మలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఒప్పుకుందన్నారు. మరి అలాంటప్పుడు ఠాకూర్, వెంకటేశ్వరావును తప్పించి శివాజీ చౌదరికి ఆ బాధ్యతలు అప్పగిస్తే మంచిదని సూచించారు. ఆపరేషన్ గరుడ అన్నది ఓ డ్రామా అనీ, దీన్ని నటుడు శివాజీతో చంద్రబాబు, లోకేశ్ ఆడిస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై గుంటూరులో చెప్పులు వేయించిన చంద్రబాబు, ఇటీవల ఢిల్లీలో ఆయన చెప్పులను తలపై పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. తొలుత కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం కోడలు బ్రాహ్మణిని రాహుల్ హాజరయ్యే పారిశ్రామివేత్తల సదస్సుకు చంద్రబాబు పంపారని ఆరోపించారు. అదే చంద్రబాబు కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రమాణస్వీకారం సందర్భంగా డైరెక్టుగా రాహుల్ తో చేతులు కలిపారన్నారు. టీడీపీ-కాంగ్రెస్ పొత్తు చూసి ఏపీ ప్రజలు చీదరించుకుంటున్నారని రోజా వ్యాఖ్యానించారు. టీడీపీని చంద్రబాబు తెలుగు దాల్ పప్పుగా మార్చేశారని ఎద్దేవా చేశారు.

More Telugu News