Andhra Pradesh: టీడీపీని గెలిపించేంత సీన్ పవన్ కల్యాణ్ కు లేదు.. ఆయన సాయం చేశారంతే!: హోంమంత్రి చినరాజప్ప

  • కాంగ్రెస్ తో టీడీపీ పొత్తును సమర్థిస్తున్నా
  • నిరుద్యోగ యువత కోసం నోటిఫికేషన్ జారీ
  • ఏలూరులో పర్యటించిన హోంమంత్రి

2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయానికి పవన్ కల్యాణ్ సహకరించారని  ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. అంతేతప్ప పవన్ కల్యాణ్ కారణంగానే తాము అధికారంలో వచ్చామని చెప్పడం సరికాదన్నారు. టీడీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేంత సీన్ పవన్ కు లేదని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని సమర్థిస్తున్నట్లు చినరాజప్ప చెప్పారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ తో జత కట్టాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఈరోజు పోలీసుల గృహసముదాయాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై దాడిచేసిన శ్రీనివాసరావు ఆయన అభిమానేనని చినరాజప్ప స్పష్టం చేశారు. ఇప్పటికే నిందితుడిని పలుమార్లు విచారించామనీ, మరోసారి కస్టడీ కోసం కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు.

జగన్ సీఎం కావాలనే ఈ దాడి చేసినట్లు నిందితుడు చెబుతున్నాడన్నారు. ఏదేమైనా శ్రీనివాసరావుకు ప్రాణాపాయం ఉంటే భద్రత కల్పిస్తామని వ్యాఖ్యానించారు. ఏపీలో నిరుద్యోగుల కోసం 3,137 పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశామని హోంమంత్రి అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

More Telugu News