polavaram: పోలవరం ఏజెన్సీ గ్రామాలకు ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మాణం.. శరవేగంగా పనులు!

  • ప్రధాన రహదారి నెర్రెలుగా విడిపోయి నిరుపయోగంగా మారడంతో చర్యలు
  • వాహనాలు వెళ్లేందుకు రోడ్ల నిర్మాణం
  • విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు యత్నాలు

పోలవరం ప్రాంతంలో ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం హుటాహుటిన చర్యలు చేపట్టింది. ఏజెన్సీలోని పందొమ్మిది గ్రామాలను కలిపే ప్రధాన రహదారి నెర్రెలుగా విడిపోయి నిరుపయోగంగా మారడంతో ప్రత్యామ్నాయ మార్గాలను నిర్మిస్తున్నారు. ఏజెన్సీ గ్రామాలకు వెళ్లేందుకు రోడ్డుతోపాటు పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం జలాశయం పనుల వాహనాలు వెళ్లేందుకు డంపింగ్‌ యార్డు మీదుగా మరోదారిని నిర్మిస్తున్నారు. అలాగే రోడ్డు దెబ్బతిని విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో సరఫరా నిలిచిపోయింది. సరఫరా పునరుద్ధరణకు అధికారులు చర్యలు చేపట్టారు.

ఆదివారం ఉదయానికి నెర్రెలు మరింత ప్రమాదకరంగా మారడం, ఇదో విశేషంగా ప్రచారం జరగడంతో వీటిని చూడడానికి ప్రజలు, పాపికొండలకు వెళ్తున్నవారు భారీగా తరలివస్తున్నారు. రోడ్డు పెద్దపెద్ద గోతులుగా మారడంతో సందర్శకులు అందులో జారిపడతారేమోనని పోలీసులు వారికి జాగ్రత్తలు సూచిస్తునే ఉన్నారు.

కాగా, పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించడానికి మూడు రోజుల క్రితం దేశ రాజధాని నుంచి వచ్చిన మట్టి, రాయి నమూనా పరిశోధన సంస్థ (సీఎస్‌ఎంఆర్‌ఎన్‌) శాస్త్రవేత్తలు ముగ్గురు ఈ నెర్రెలను పరిశీలించారు. స్పిల్‌వే చానల్‌, రోడ్డు ఉబికిన పరిసర ప్రాంతాల్లో మట్టి నమూనాలను సేకరించారు. మట్టిలో ఇటువంటి మార్పు సహజమని వారు తెలిపారు.

రోడ్డులో నెర్రెలు రావడానికి నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉండే మట్టి స్వభావమే కారణమని నిపుణులు, ఇంజనీర్లు చెబుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో 2008-09 సంవత్సరాల మధ్య సరిగ్గా ఇటువంటి పరిస్థితే ఎదురయిందని భారత భూగర్భ పరిశోధనా సంస్థ (జియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా-జీఎస్‌ఐ) డైరెక్టర్‌ అజయ్‌కుమార్‌ తెలిపారు.

‘నదీ పరీవాహక ప్రాంతాల్లో ఒండ్రు మట్టి అధికంగా ఉంటుంది. దీనికి గట్టితనం తక్కువ. పైగా వేగంగా ద్రవరూపంలోకి మారిపోతుంది. జారిపోయే స్వభావం ఉంటుంది. కిందన కూడా ఒండ్రుమట్టి ఉండి అది ఒదులైన సమయంలో ఇలా మట్టి జారిపోయి నెర్రెలు ఏర్పడతాయి’ అని పోలవరం ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు.

More Telugu News