Andhra Pradesh: పవన్ కల్యాణ్ పర్యటనను అడ్డుకున్న మైనింగ్ మాఫియా.. నడుచుకుంటూ ముందుకెళ్లిన జనసేన అధినేత!

  • తూర్పుగోదావరి జిల్లా వంతాడ గ్రామంలో ఘటన
  • మైనింగ్ ప్రాంత సందర్శనకు పవన్ యత్నం
  • రాకను అడ్డుకుంటూ రోడ్డును బ్లాక్ చేసిన వ్యక్తులు

తూర్పుగోదావరి జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ఏడాదికి రూ.3,000 కోట్ల మైనింగ్ చేపడుతున్నప్పటికీ స్థానిక గిరిజనులకు మంచినీటి సౌకర్యం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మైనింగ్ మాఫియా గిరిజనుల భూములను భయపెట్టి లాక్కుందని ఆరోపించారు. ఇప్పటికీ అసలు భూముల పట్టా గిరిజనుల పేరు మీదే ఉందని వెల్లడించారు. జిల్లాలోని ప్రత్తిపాడు మండలం వంతాడ గ్రామంలో పవన్ నిన్న రాత్రి పర్యటించారు.

ఈ సందర్భంగా పవన్ రాకను అడ్డుకునేందుకు కొందరు వ్యక్తులు రోడ్డుపై భారీగా మట్టిని పోసి మార్గాన్ని బ్లాక్ చేశారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన అధినేత, కాలినడకన వెళ్లి గిరిజనులను కలుసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. వేల కోట్ల దోపిడీ బయటపడుతుందన్న భయంతోనే తన పర్యటనను అడ్డుకునేందుకు రోడ్డును బ్లాక్ చేశారని మండిపడ్డారు.

గిరిజనుల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని దుయ్యబట్టారు. అవినీతి రహిత పాలన అందిస్తున్నామని చెబుతున్న చంద్రబాబుకు ఇది కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఇలాంటి మైనింగ్ మాఫియా కారణంగా ఏపీ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వంతాడ గ్రామంలో గిరిజనులకు న్యాయం జరిగేవరకూ జనసేన పోరాడుతుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

More Telugu News