Andhra Pradesh: బాపట్ల వ్యవసాయ అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం!

  • తిత్లీ బాధితులకు రికార్డు సమయంలో సాయం
  • కేంద్రం మొండిచెయ్యి చూపింది
  • నీరు ప్రగతి టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు

ప్రకృతి విపత్తుల సందర్భంగా సరైన సమయంలో బాధితులను ఆదుకుంటేనే ప్రయోజనం ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన ‘తిత్లీ’ తుపాను విషయంలో సాయం చేయడంపై కేంద్రం నిర్లక్ష్యం వహించిందని వెల్లడించారు. కేంద్ర సాయం లేకపోయినా సొంత వనరులతోనే ప్రజలను ఆదుకునేందుకు ముందుకొచ్చామని అన్నారు. అమరావతిలో కలెక్టర్లు, జిల్లాల అధికారులతో నీరు-ప్రగతి కార్యక్రమంతో పాటు వ్యవసాయం పురోగతిపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తిత్లీ బాధితులకు ఈ రోజు నష్టపరిహారం చెక్కులను అందజేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నష్టపోయిన బాధితులకు రూ.530 కోట్ల మేర పరిహారం ఇస్తామన్నారు. తిత్లీ జిల్లాలో విలయ విధ్వంసం సృష్టించినా కేవలం 15 రోజుల్లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చామనీ, పాతిక రోజుల్లోనే పరిహారం అందజేస్తున్నామని వెల్లడించారు. తుపాను సహాయక చర్యల్లో చాలా మంది అధికారులు, సిబ్బంది విశ్రాంతి లేకుండా పనిచేశారని బాబు కితాబిచ్చారు.

సహాయక చర్యల్లో అద్భుతంగా పనిచేసిన అధికారులు, సిబ్బందిని రివార్డులతో సత్కరిస్తామని సీఎం చెప్పారు. బాధ్యతాయుతమైన పాలనకు ఏపీ ఓ చిరునామాగా మారిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అవినీతి రహిత రాష్ట్రాల జాబితాలో మూడో స్థానంలో ఉన్నామనీ, తొలి స్థానానికి చేరుకునేలా కృషి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలోని బాపట్లలో వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. విత్తన ప్యాకెట్లను తారుమారు చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

More Telugu News