Uttar Pradesh: తెలుగుదేశంతో కలిసిన కారణమిదే: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • కేసీఆర్ కుటుంబ పాలన
  • రాష్ట్రాన్ని రక్షించేందుకే టీడీపీతో పొత్తు
  • హామీలను విస్మరించిన కేసీఆర్
  • టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్

తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబ పాలన నుంచి కాపాడుకునేందుకే తెలుగుదేశం పార్టీతో జతకట్టామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, తెలుగుదేశంతో పాటు టీజేఎస్, సీపీఐలను కూడా తాము కలుపుకుని ముందుకు సాగుతున్నామని చెప్పారు. కేవలం టీడీపీతో మాత్రమే తాము పొత్తు కుదుర్చుకోలేదని అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టుకూ కేసీఆర్ శంకుస్థాపన చేసి, పూర్తి చేయలేదని విమర్శించిన ఉత్తమ్, ప్రాజెక్టుల పేరుతో వందల కోట్లను కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు.

గత నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజలను మభ్యపెట్టడం మినహా కేసీఆర్ మరేమీ చేయలేదని వ్యాఖ్యానించిన ఆయన, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను కేసీఆర్ మరచిపోయారని అన్నారు. అన్ని గ్రామాలకూ నీరు ఇవ్వకుండా ఓట్లను అడగబోనని చెప్పిన కేసీఆర్, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు నష్టం జరుగకుండా చూడటం, ఏర్పడిన కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా చేయడమే లక్ష్యంగా మహా కూటమి ఏర్పడిందని స్పష్టం చేశారు.

More Telugu News