Avani: వారం వ్యవధిలో రెండో ఘటన... మరో పెద్దపులిని చంపేశారు!

  • ఆదివారం నాడు వ్యక్తిపై దాడి చేసిన టైగర్
  • వేటాడి చంపిన గ్రామస్థులు
  • పర్యావరణం దెబ్బతినడంతో జనావాసాల్లోకి వన్య ప్రాణులు

లక్నో సమీపంలో ఓ వ్యక్తిపై దాడి చేసిందని ఆరోపిస్తూ, ప్రజలు ఓ పెద్దపులిని కొట్టి చంపారు. దేశంలో పర్యావరణ సమతుల్యం మరింతగా దెబ్బతింటోందని చెప్పడానికి, వారం రోజుల వ్యవధిలో జరిగిన ఈ రెండో ఘటనే తార్కాణం. గత వారంలో మనుషులను తినడానికి అలవాటు పడిందని ఆరోపిస్తూ, మహారాష్ట్రలో అవని అనే పెద్దపులిని చంపేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజా ఘటన లక్నోకు 210 కిలోమీటర్ల దూరంలోని దుడ్వా టైగర్ రిజర్వ్ సమీపంలో జరిగింది.

పదేళ్ల వయసున్న ఓ పెద్దపులి, ఆదివారం నాడు సమీప గ్రామంపై పడి, ఓ వ్యక్తిపై దాడి చేయగా, తీవ్ర గాయాల పాలైన అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రజలు, ఆ పెద్దపులిని వేటాడి, కొట్టి చంపి, ట్రాక్టర్ కు కట్టి ఈడ్చుకెళ్లారు. అధికారులు మాత్రం, ఈ పెద్దపులి గత పదేళ్లలో ఎన్నడూ ప్రజలపై దాడులు చేయలేదని అంటున్నారు. అడవుల్లోకి ప్రజలు వెళుతుండటం పెద్దపులుల ఏకాంతాన్ని దెబ్చతీస్తోందని అంటున్నారు.

అడవుల నుంచి బయటకు వస్తున్న పెద్దపులులు, తమ పశు సంపదను పొట్టన పెట్టుకుంటున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అడవులను అధికంగా నాశనం చేస్తున్న కారణంగానే వన్యప్రాణులు గ్రామాలపైకి వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. కాగా, 2014 లెక్కల ప్రకారం, ఇండియాలో 2,226 పెద్దపులులు ఉన్నాయి.

More Telugu News