Team India: టీమిండియాకు ముచ్చెమటలు పట్టించిన విండీస్.. తొలి టీ20 భారత్‌దే

  • చెమటోడ్చి గెలిచిన భారత్
  • సునాయాస లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆపసోపాలు
  • కుల్దీప్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్

విండీస్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టీ20లో భారత్ అతి కష్టం మీద విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 110 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆపసోపాలు పడింది. చివరికి 13 బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుని మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించింది.

టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ వికెట్లను వెంటవెంటనే చేజార్చుకుంది. భారత బౌలర్ల దెబ్బకు విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడలా కుప్పకూలింది. 16 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన విండీస్ ఆ తర్వాత కుదురుకోలేకపోయింది. ఆటగాళ్లు క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. ఆదుకుంటారనుకున్న షిమ్రాన్ హెట్‌మయెర్ (10), కీరన్ పొలార్డ్ (14), డారెన్ బ్రావో (5) కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు.

చివర్లో ఫాబియన్ అలెన్ (27) మెరుపులు మెరిపించడంతో ఆ మాత్రం పరుగులైనా చేయగలిగింది. జట్టు మొత్తంలో అతడు చేసిన పరుగులే అత్యధికం కావడం గమనార్హం. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసి భారత్ ముందు స్వల్ప విజయ లక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీసుకోగా, ఉమేశ్ యాదవ్, ఖలీల్ అహ్మద్, జస్ప్రిత్ బుమ్రా, కృనాల్ పాండ్యా చెరో వికెట్ తీసుకున్నారు.

అనంతరం 110 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు విండీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. తొలి ఓవర్ చివరి బంతికి కెప్టెన్ రోహిత్ శర్మ (6) అవుటయ్యాడు. మరో పది పరుగులు జోడించాక మరో ఓపెనర్ శిఖర్ ధవన్ (3) పెవిలియన్ చేరాడు. దీంతో అభిమానుల్లో భారత్ గెలుపుపై అనుమానం వ్యక్తమైంది.

జట్టులో చోటు దక్కించుకున్న రిషబ్ పంత్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఒక్క పరుగుకే ఔటయ్యాడు. 35 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోవడంతో భారత్ గెలుపు ఆశలు సన్నగిల్లాయి. మనీష్ పాండే (19), వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ (31) పరుగులతో విజయంపై ఆశలు రేపారు. చివరల్లో కృనాల్ పాండ్యా (21) మెరుపులు మెరిపించడంతో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

 విండీస్ బౌలర్లలో థామస్, బ్రాత్‌వైట్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, పియరెకు ఓ వికెట్ దక్కింది. మూడు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించిన కుల్దీప్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

More Telugu News