KCR: నియంతలా మారిన కేసీఆర్‌కు బుద్ధి చెప్పండి: స్మృతి ఇరానీ పిలుపు

  • ప్రజాస్వామ్యం అంటే కుటుంబ పాలన కాదు
  • డిసెంబరు 7ను తెలంగాణ విమోచన దినంగా భావించి ఓట్లేయండి
  • కిషన్ రెడ్డి విజయమే అసలైన దీపావళి

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న డిసెంబరు 7ను తెలంగాణ విమోచన దినంగా భావించి కేసీఆర్‌ను ఓడించేందుకు కార్యకర్తలంతా కృషి చేయాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ నియంతలా మారారని ఆరోపించారు. వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటువేసి టీఆర్ఎస్‌కు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.

హైదరాబాద్ అంబర్‌పేట 'ఛే నంబరు' చౌరస్తాలో నిర్వహించిన బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  ప్రజాస్వామ్యం అంటే కుటుంబ పాలన అని టీఆర్ఎస్ భావిస్తోందని విమర్శించారు. పేదల కోసం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

మోదీకి దేశవ్యాప్తంగా ఆదరణ ఉందని మంత్రి పేర్కొన్నారు.  కిషన్ రెడ్డి విజయాన్ని నిజమైన దీపావళి వేడుకగా భావించాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టి బీజేపీ గెలుపునకు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ కోరారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు బీజేపీతోనే ఉన్నారని, తమ విజయాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News