Telangana: టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి కారణం ఇదే: మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చౌహాన్

  • ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నిధులు లేవు
  • రూ.2.20 లక్షల కోట్ల మేరకు అప్పులు చేశారు
  •  అందుకే, టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నిధులు లేవని, రూ.2.20 లక్షల కోట్ల మేరకు అప్పులు చేశారని, టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి కారణం ఇదేనని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ ఆరోపించారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ‘తెలంగాణ’ను యూపీఏ ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు మోసపోయారని, ఒక కుటుంబపాలనలో తెలంగాణ ఉందని, ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు అక్రమ ఇసుక దందాలు చేస్తున్నారని, నేరెళ్ల ఘటనలో ఎస్సీ కులస్తులను చంపారని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఒకప్పుడు తెలంగాణ ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా’ ఉండేదని, ఇప్పుడు రాష్ట్రంలో వ్యవసాయం పరిస్థితి మారిపోయిందని విమర్శించారు. ఎమ్మెల్యేలకు కొత్త భవనాలు నిర్మించారని, రాష్ట్రంలో పేదలకు అవసరమైన ఆసుపత్రులు మాత్రం నిర్మించలేదని, కేజీ-పీజీ ఉచిత విద్య అమలు చేయలేదని, ‘మిషన్ భగీరథ’ కమిషన్ల కోసం నడుస్తోందని, కేసీఆర్ ది నియంతృత్వ పాలన అని విరుచుకుపడ్డారు. ఎస్సీ అభ్యర్థిని తెలంగాణ సీఎం చేస్తానన్న కేసీఆర్, ఆ పని చేయలేదని, అందుకే, ఆయన్ని ‘నయా నవాబ్’ అని పిలుస్తున్నారని చౌహాన్ విమర్శించారు.

More Telugu News