Crime News: రాజేంద్రనగర్‌లో మంగళసూత్రాల చోరుల ఆచూకీ లభ్యం!

  • మహారాష్ట్ర అంబేవ్యాలీకి చెందిన ఇరానీ ముఠా సభ్యులుగా గుర్తింపు
  • సీసీ కెమెరా పుటేజీతో లభించిన ఆధారం
  • అక్కడి పోలీసుల సహకారంతో చురుకుగా దర్యాప్తు

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ పరిసరాల్లో పురోహితుల వేషంతో సంచరిస్తూ మహిళల మంగళసూత్రాల ఆభరణాలు కొట్టేసిన ముఠా ఆచూకీని సైబరాబాద్‌ పోలీసులు కనిపెట్టారు. మహారాష్ట్ర అంబేవ్యాలీకి చెందిన ఇరానీ ముఠా సభ్యులు జావెద్‌ బలి జాఫ్రి, వసీం సిరాజ్‌ బలిజాఫ్రి ఈ నేరాలకు పాల్పడినట్లు, వీరిద్దరూ పాత నేరస్తులేనని గుర్తించినట్లు సమాచారం. అక్టోబరు 22వ తేదీన  ద్విచక్ర వాహనంపై వచ్చిన వీరిద్దరూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2.30 గంట మధ్య హల్‌చల్‌ చేశారు. మహిళలు నిర్వహిస్తున్న దుకాణాలను లక్ష్యంగా చేసుకున్నారు.

తాము పూజారులమంటూ పరిచయం చేసుకున్నారు. తమ పేరున సమీపంలోని ఆలయం హుండీలో వెయ్యి వేయాలంటూ చెప్పేవారు. తర్వాత నగదు ఇచ్చే క్రమంలో ముందు పూజలు చేశారు. డబ్బుపై బరువు పెట్టాలంటూ వారి మంగళ సూత్రాలు పెట్టమన్నారు. అనంతరం బాధితుల కళ్లుగప్పి ఆభరణాలు మాయం చేశారు. ఈ విధంగా ఆరు చోట్ల మాయచేసి 20 తులాల బంగారం ఎత్తుకు వెళ్లారు. బాధితుల వరుస ఫిర్యాదులతో అపమ్రత్తమైన సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు.

నిందితులు వినియోగించిన బిస్కెట్‌ ప్యాకెట్లపై ఉన్న ఆనవాళ్ల ఆధారంగా అక్కడి పోలీసులకు నిందితుల చిత్రాలు పంపించారు. నిఘా కెమెరాకు దొరికిన ఇద్దరితోపాటు మరో ఇద్దరు వీరికి పైలట్‌గా వ్యవహరించినట్లు గుర్తించారు. దీంతో సైబరాబాద్‌ ప్రత్యేక పోలీసుల బృందం లభించిన ఆధారాలతో మహారాష్ట్ర చేరుకుని నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిసింది. నిందితులు నల్లరంగు హీరోహోండా యాక్టివా బండి వినియోగించడంతో ఇప్పటికే అటువంటివి దాదాపు రెండు వేల వాహనాలను పరిశీలించారు.

More Telugu News