Pawan Kalyan: నన్ను సీఎంను చేయండి... సమస్యలు తీర్చకుంటే చొక్కా పట్టుకోండి: పవన్ కల్యాణ్

  • బాధ్యతగా పనిచేస్తాను
  • విభజన హామీలు అమలు కావాలంటే గెలిపించండి
  • టీడీపీ కలిసొస్తే కేంద్రంపై ఉమ్మడి పోరు 

తనను సీఎంను చేయాలని, ప్రజల సమస్యలను పరిష్కరించకున్నా, బాధ్యతగా పనిచేయకున్నా చొక్క పట్టుకుని నిలదీయాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. తన పార్టీ అధికారంలోకి వస్తే పాలనాపరంగా బాధ్యతగా ఉంటానని భరోసాను ఇచ్చారు. తనను సీఎంగా చూడాలని యువత కోరుతోందని చెప్పిన ఆయన, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వంటి విభజన హామీలు అమలు కావాలంటే, జనసేన, సీపీఐ, సీపీఎంలకు అధికారాన్ని అప్పగించాలని అన్నారు.

హోదాపై ఉమ్మడిగా పోరాడేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధం కావాలని, ముందుకు నడవాలని పిలుపునిచ్చిన ఆయన, మోదీతో గొడవపడే నైతికబలం జనసేనకే ఉందని అన్నారు. ఆ బలం టీడీపీకి లేదని, వారిపై ఉన్న అవినీతి ఆరోపణలే ఇందుకు కారణమని చెప్పారు. తన వియ్యంకుడికి కాంట్రాక్టులు ఇప్పించుకోవడంలోనే యనమల ఆసక్తిని చూపుతున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో బాక్సైట్ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయని, తాను ఎన్నిమార్లు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని అన్నారు. గనుల తవ్వకాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎక్కడికి వెళ్లినా కన్నీటితో నిండిన గాధలే కనిపిస్తున్నాయని అన్నారు. తనకు అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలూ సమానమేనని, అందరినీ ఒకేలా చూసే మనసున్నవాడినని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

More Telugu News