Facebook: రూ. 7 మాత్రమే... ఫేస్ బుక్ లో ఉన్న 12 కోట్ల మంది ఖాతాల హ్యాక్!

  • ఫొటోలు, వివరాలు ఆన్ లైన్లో 
  • 81 వేల ఖాతాల సమాచారం హ్యాకర్ల చేతిలో
  • ఐదు మాత్రమే కనిపించాయన్న ఫేస్ బుక్

మీకు ఫేస్ బుక్ లో ఖాతా ఉందా? అయితే, మీ అన్ని ఫొటోలు, మీ స్నేహితుల వివరాలు, వారి ఖాతాల ఐడీలు తదితర వివరాలన్నీ 7 రూపాయలకే అమ్మకానికి ఉన్నాయని తెలుసా? ఆన్ లైన్లో 12 కోట్లకు పైగా ప్రజల ఖాతాలు హ్యాక్ అయ్యాయి. సైబర్ నేరగాళ్లు, అందరి వివరాలనూ హ్యాక్ చేసి, 81 వేల అకౌంట్లలోని సమాచారాన్ని ఆన్ లైన్ లో వేలానికి పెట్టారు. ఒక్కో అకౌంట్ వివరాలను 10 సెంట్లకు (సుమారు రూ. 7) అమ్ముతామంటున్నారు.

గతంలో బహిర్గతమైన కేంబ్రిడ్జ్ అనలిటికా కుంభకోణం కన్నా ఇదే అతిపెద్ద కుంభకోణం అన్నట్టు తెలుస్తోంది. ఫేస్ బుక్ లో జరిగిన అతిపెద్ద సెక్యూరిటీ వైఫల్యం కూడా ఇదే. అప్పట్లో 5 కోట్ల ఖాతాలు హ్యాక్ అయినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా, ఉక్రెయిన్‌, రష్యా, బ్రిటన్, అమెరికా, బ్రెజిల్‌ కు చెందిన ఖాతాల వివరాలు ఆన్ లైన్లో కనిపిస్తున్నాయి. వారి వివరాలు కావాలంటే, తమకు రూ. 7 చెల్లించాలని హ్యాకర్లు డిమాండ్ చేస్తుండటం గమనార్హం.

కాగా, దీనిపై స్పందించిన ఫేస్ బుక్ యాజమాన్యం, రష్యాకు చెందిన ఐదుగురి వివరాలు మాత్రమే ఆన్ లైన్లో కనిపించాయని పేర్కొంది. దీనిపై పోలీసు విభాగాలను విచారణకు కోరామని, ఫేస్‌ బుక్‌ ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఉపాధ్యక్షుడు గయ్‌ రోజ్‌ తెలిపారు.

More Telugu News