t-congress: ‘కాంగ్రెస్’లో నలభై మంది సీఎం అభ్యర్థులున్నారు!: మంత్రి కేటీఆర్

  • ఒకవేళ గెలిస్తే.. ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?
  • 40 మంది సీఎం అభ్యర్థులకు 60 నెలలు ఎలా పంచుతాం?
  • నెలకొక్కరు ముఖ్యమంత్రిగా ఉంటారా?

‘కాంగ్రెస్’లో నలభై మంది సీఎం అభ్యర్థులున్నారని, ఒకవేళ ఆ పార్టీ గెలిచి అధికారంలోకొస్తే.. మ్యూజికల్ చైర్స్ ఆటలో మాదిరి నెలకో సీఎంను వారు మారుస్తారని మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మహబూబాబాద్ లోని ఎన్టీఆర్ మైదానంలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు, వాళ్లు అధికారంలోకి వచ్చేసినట్టే ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని విమర్శించారు.

త్వరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టుగానే మాట్లాడుతోందని, ఒకవేళ గెలిస్తే.. ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? అని ప్రశ్నించారు. ఈ పార్టీలో నలభై మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని, ఆ నలభై మందికి అరవై నెలలు ఎలా పంచుతాం? నెలకొక్కరు ముఖ్యమంత్రిగా ఉంటారా? అని ప్రశ్నించారు. అప్పుడు, అది ముఖ్యమంత్రి పదవి ఎందుకవుతుంది.. బడిలో పిల్లలు ఆడే కుర్చీలాట అవుతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు, ‘మహాకూటమి’కి నాయకుడు ఎవరు? ఈ కూటమిలో ఎవరి అజెండా వాళ్లు చెబుతున్నారని సెటైర్లు విసిరారు.  

More Telugu News