Andhra Pradesh: జగన్ పై హత్యాయత్నం ఘటనపై ఆరోపణలు.. వైసీపీ నేత జోగి రమేశ్ కు పోలీసుల నోటీసులు!

  • ఈ దాడిని టీడీపీ కార్యకర్తలే చేశారన్న రమేశ్
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన వర్ల రామయ్య
  • 6న విచారణకు హాజరుకావాలని నోటీసులు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. తాజాగా వైసీపీ నేత జోగి రమేశ్ కు గుంటూరు పోలీసులు ఈ రోజు నోటీసులు జారీచేశారు. జగన్ పై దాడిని టీడీపీ కార్యకర్తలే చేశారని ఇటీవల వైసీపీ నేత జోగి రమేశ్ ఆరోపించారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య గుంటూరులోని అరండల్ పేట పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీచేశారు. ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను తమకు సమర్పించాలని కోరారు.

మరోవైపు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై వైసీపీ నేత జోగి రమేశ్ స్పందించారు. జగన్ పై హత్యాయత్నం కేసు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, విచారణను నీరుగార్చేందుకు టీడీపీ ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తోందని మండిపడ్డారు. ఎన్ని వేధింపులకు గురిచేసినా టీడీపీ ప్రభుత్వ అధికార దుర్వినియోగంపై పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వ వేధింపులను న్యాయపరంగా ఎదుర్కొంటానని అన్నారు. గత నెలలో వైజాగ్ ఎయిర్ పోర్టులో జగన్ పై శ్రీనివాసరావు అనే యువకుడు హత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ జరుపుతోంది.

More Telugu News