Telangana: కేంద్రం బయ్యారం స్టీల్ ప్లాంట్ పెడితే ఓకే.. లేదంటే మేమే రంగంలోకి దిగుతాం!: మంత్రి కేటీఆర్

  • కాంగ్రెస్, టీడీపీలు ప్రజలకు ముఖం చూపలేదు
  • 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఒక్కటయ్యాయి
  • ప్రజాఆశీర్వాద సభలో మాట్లాడిన కేటీఆర్

ఎన్ని అడ్డంకులు ఎదురైనా మహబూబాబాద్ లో బయ్యారం ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని ఇప్పటికే కోరామన్నారు. ఒకవేళ కేంద్రం చొరవ చూపకుంటే రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంటును నిర్మిస్తుందని స్పష్టం చేశారు. ఇందుకోసం జిల్లాలో అపారమైన ఇనుము నిల్వలు ఉన్నాయన్నారు. మహబూబాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈరోజు నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేటీఆర్ మాట్లాడారు.

కాంగ్రెస్, టీడీపీ నేతలు గత నాలుగేళ్లుగా ప్రజలకు ముఖం చూపించలేదనీ, అలాంటి నేతలు ఇప్పుడు ఏకమయ్యారని విమర్శించారు. 40 ఏళ్లుగా ఉప్పునిప్పుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీలు ఈరోజు ఒక్కటి అయ్యాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దించాలని ప్రతిపక్షాలు పిలుపునివ్వడంపై తీవ్రంగా స్పందిస్తూ.. ‘దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చేపట్టినందుకు కేసీఆర్ ను దించేయాలా?

గత 70 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు చేయలేని పనులను టీఆర్ఎస్ నాలుగేళ్లలో చేసి చూపింది. ఇందుకోసం గద్దె దించేయాలా?’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి టీఆర్ఎస్ కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

More Telugu News