Uttar Pradesh: శ్రీరాముడు కలలో చెప్పాడని హిందూ మతం స్వీకరించిన ముస్లిం కుటుంబం.. బంధువుల బెదిరింపులు!

  • ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ పట్టణంలో ఘటన
  • 20 రోజులుగా కలలో శ్రీరాముడి దర్శనం
  • హిందూమతం స్వీకరించాలని ఆదేశం

సాక్షాత్తూ శ్రీరాముడే తనకు చెప్పాడంటూ ఓ ముస్లిం వ్యక్తి హిందూ మతాన్ని స్వీకరించాడు. అతనొక్కడే కాకుండా సదరు వ్యక్తికి చెందిన మొత్తం కుటుంబం కూడా హిందూ మతాన్ని స్వీకరించింది. దీంతో బంధువులు, సన్నిహితులు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని హెచ్చరించారు. అయితే ఇందుకు అంగీకరించని ఆ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.

యూపీలోని షామ్లీ పట్టణంలో షహజాద్ రాణాకు గత 20 రోజుల నుంచి శ్రీరాముడు కలలో దర్శనిమిస్తున్నారు. ఆయన మతం మార్చుకోవాలని చెప్పడంతో రాణా తన కుటుంబంతో కలిసి హిందూ మతాన్ని స్వీకరించారు. తన పేరును కూడా సంజూ రాణాగా మార్చుకున్నారు. అయితే బంధువులు, సన్నిహితుల నుంచి బెదిరింపులు తీవ్రం కావడంతో ఆయన జిల్లా కోర్టును ఆశ్రయించారు. తనకు రక్షణ కల్పించాల్సిందిగా న్యాయమూర్తిని కోరారు.

తన పూర్వీకులు హిందువులేననీ, కొన్ని కారణాల రీత్యా ఇస్లాం స్వీకరించారని తెలిపారు. ఇష్ట ప్రకారమే తన కుటుంబం హిందూ మతం స్వీకరించిందనీ, ఇందులో ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు తమ కుటుంబం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తమకు ఎదురవుతున్న బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మరోవైపు ఈ విషయమై లక్నో ఎస్పీ దినేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు సంజూ రాణాను బెదిరించినట్లు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని వెల్లడించారు.

More Telugu News