Andhra Pradesh: చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం కంటే దౌర్భాగ్యం మరొకటి లేదు.. పొత్తుపై కనీసం మాకు కూడా చెప్పలేదు!: సి.రామచంద్రయ్య

  • బాబు కాంగ్రెస్ ను రోజూ తిట్టేవారు
  • విభజన హామీల విషయంలో అబద్ధాలు చెప్పారు
  • పార్టీ హైకమాండ్ కనీసం పీసీసీని అడగలేదు

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత సీఎం చంద్రబాబు కాంగ్రెస్ నేతలను తిట్టని రోజు లేదని ఆ పార్టీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య అన్నారు. అలాంటి చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం కంటే దౌర్భాగ్యం మరొకటి లేదని విమర్శించారు. విభజన హామీల కింద రూ.2 లక్షల కోట్లు రావాల్సి ఉన్నా వాటిని సాధించుకోవడంలో చంద్రబాబు తీవ్రంగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. విభజన హామీల విషయంలో రాష్ట్ర ప్రజలకు బాబు అబద్ధాలు చెప్పారన్నారు. ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలో తాను కొనసాగలేనని, అందుకే బయటకు వెళ్లిపోతున్నానని స్పష్టం చేశారు.

టీడీపీ-కాంగ్రెస్ పొత్తుపై పీసీసీకి కనీస సమాచారం ఇవ్వలేదనీ, సీనియర్ నాయకులను సైతం సంప్రదించలేదని రామచంద్రయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గుంటూరు పర్యటనకు వస్తే టీడీపీ కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు, జెండాలు చూపి అవమానించిన విషయాన్ని మర్చిపోయారా? అని ప్రశ్నించారు.

చంద్రబాబుకు సిద్ధాంతం, విలువలు అన్నవి లేవనీ, ఆయన ఎవరితోనైనా కలుస్తారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన పాపాల భారాన్ని తాము మోయలేమని స్పష్టం చేశారు. కాగా, టీడీపీ-కాంగ్రెస్ పొత్తును నిరసిస్తూ మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News