Ahtesham Bilal Sofi: కాలేజ్ నుంచి కనిపించకుండా పోయి.. ఐసిస్ జెండాతో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన కశ్మీరీ విద్యార్థి

  • ఐసిస్ లో చేరిన 17 ఏళ్ల విద్యార్థి బిలాల్
  • ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు.. అక్కడి నుంచి పుల్వామాకు
  • బిలాల్ ను ట్రేస్ చేసే పనిలో జమ్ముకశ్మీర్ పోలీసులు

ఉగ్రవాద సంస్థ ఐసిస్ పట్ల కశ్మీరీ యువత ఆకర్షితులవుతుండటం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. కశ్మీర్ లోయలో అప్పుడప్పుడు ఐసిస్ జెండాలు కనిపిస్తుండటం అందరికీ తెలిసిన విషయమే. తాజాగా గ్రేటర్ నోయిడాలోని ఓ కాలేజీలో చదువుకుంటున్న కశ్మీర్ కు చెందిన విద్యార్థి అహ్తేసామ్ బిలాల్ సోఫీ (17) గత వారంలో కనిపించకుండా పోయాడు. తాజాగా ఐసిస్ జెండా ఎదుట నిలుచున్న బిలాల్ ఫొటో ఫేస్ బుక్ తో పాటు ఇతర సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. నల్లటి దుస్తులతో పాటు ఓ కిట్ బ్యాగ్ ధరించినట్టు ఫొటోలో ఉంది. అతను ఐసిస్ లో చేరినట్టు భావిస్తున్నారు.

శ్రీనగర్ డౌన్ టౌన్ కు చెందిన బిలాల్... గ్రేటర్ నోయిడాలోని శారదా యూనివర్శిటీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అక్టోబర్ 28న యూనివర్శిటీ అధికారుల పర్మిషన్ తో అక్కడకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీకి వెళ్లాడు. ఆ తర్వాత అతను కనిపించకుండా పోయాడు. ఆ మరుసటి రోజు కూడా బిలాల్ తిరిగి రాకపోవడంతో యూనివర్శిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 48 గంటల తర్వాత అతని మొబైల్ శ్రీనగర్ లొకేషన్ చూపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అతని ఫోన్ నుంచి చివరి కాల్ అతని తండ్రికి వెళ్లింది. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాప్ అయింది.

తన తండ్రితో ఫోన్ లో మాట్లాడుతూ, తాను ఢిల్లీ మెట్రో రైల్లో ఉన్నానని బిలాల్ తెలిపాడు. కానీ, ఆ సమయంలో అతను శ్రీనగర్ లో ఉన్నట్టు ఫోన్ కాల్ ట్రేసింగ్ లో తేలిందని... తన తండ్రికి అతను అబద్ధం చెప్పాడని పోలీసు అధికారులు తెలిపారు. బిలాల్ అక్టోబర్ 28న ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు విమానంలో వెళ్లాడని... ఆరోజు సాయంత్రానికి పుల్వామాకు చేరుకున్నాడని చెప్పారు. అతను ఎక్కడున్నాడో కనిపెట్టేందుకు జమ్ముకశ్మీర్ పోలీసులు కూడా ఆపరేషన్ చేపట్టారు. 

More Telugu News