kerala: అంత్యక్రియలు ముగిసిన 15 రోజుల తర్వాత ఇంటికొచ్చిన కుమారుడు.. షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు!

  • పక్కింటి వారితో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తి
  • కర్ణాటకలో మృతి చెందిన వ్యక్తిని తమ కుమారుడిగా గుర్తించి అంత్యక్రియలు
  • 15 రోజుల తర్వాత తిరిగొచ్చిన కుమారుడిని చూసి అవాక్కయిన కుటుంబ సభ్యులు

అదృశ్యమైన కుమారుడు విగతజీవిగా కనిపించడంతో గుండెలవిసేలా రోదించిన ఆ కుటుంబం 15 రోజుల క్రితం కుమారుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. ఇంకా ఆ విషాదం నుంచి తేరుకోకముందే ఆ కుటుంబానికి మరో షాక్ తగిలింది. చనిపోయిన తమ కుమారుడు అకస్మాత్తుగా ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు మరోమారు షాక్‌కు గురయ్యారు. కేరళలో జరిగిందీ ఘటన.

ఈ ఏడాది సెప్టెంబరు 3న పులపల్లిలోని ఆడికొల్లీకి చెందిన సాజి (48) అదృశ్యమయ్యాడు. అక్టోబరు 13న కర్ణాటకలోని బీచనహల్లి పోలీస్ స్టేషన్ నుంచి పులపల్లి పోలీస్ స్టేషన్‌కు ఫోనొచ్చింది. కుళ్లిన స్థితిలో ఓ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని, వచ్చి దానిని గుర్తించాల్సిందిగా కోరారు. అదే సమయంలో, ఓ కేసు విషయంలో  సాజి సోదరుడు జినేష్‌‌ను విచారించేందుకు పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆ సమయంలో బీచనహళ్లి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. స్టేషన్‌లో ఏదైనా మిస్సింగ్ కేసు నమోదైందా? అని ప్రశ్నించారు. దానికి పోలీసులు లేదని సమాధానం ఇచ్చారు. వారి సంభాషణ విన్న జినేష్ గత కొన్ని రోజులుగా తన సోదరుడు కనిపించడం లేదని చెప్పాడు. ఆ మృతదేహాన్ని తాను చూడాలనుకుంటున్నట్టు చెప్పాడు.

దీంతో  జినేష్, సాజి తల్లి ఫిలోమెనాలను పోలీసులు వయనాడ్‌లోని మనాంతవాడీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి మృతదేహాన్ని చూసిన వారు అతడు సాజీయేనని గుర్తించారు. అతడి వస్తువులు, ధరించిన చొక్కా, చెప్పులు చూసి సాజీగా నిర్ధారించారు. దీంతో పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని వారికి అప్పగించారు. అక్టోబరు 16న సాజి మృతదేహానికి కుటుంబ సభ్యులు సెయింట్ సెబాస్టియన్ చర్చిలో అంత్యక్రియలు నిర్వహించారు. సాజి చనిపోయినట్టు కర్ణాటక పోలీసులు మరణ ధ్రువీకరణ పత్రాన్ని కూడా జినేష్‌కు అందించారు.

అక్కడి వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. బుధవారం సాజి ఉన్నట్టుండి ఇంటి వద్ద ప్రత్యక్షమయ్యాడు.  అతడిని చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు. ఈ సందర్భంగా సాజీ మాట్లాడుతూ.. సెప్టెంబరు 3న తన పొరిగింటి వారితో గొడవ అవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయానని పేర్కొన్నాడు. తన వద్ద ఫోన్ లేకపోవడంతో కుటుంబ సభ్యులతో మాట్లాడలేకపోయానని తెలిపాడు. ఈ కారణంగానే తాను చనిపోయి ఉంటానని వారు భావించారని వివరించాడు. ఇంటి నుంచి వెళ్లిపోయిన తాను కన్నూరులో వివిధ ప్రాంతాల్లో కూలి పని చేశానని చెప్పుకొచ్చాడు. మొత్తానికి చనిపోయాడనుకున్న కుమారుడు తిరిగి రావడంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయినా.. అంత్యక్రియులు నిర్వహించిన మృతదేహం ఎవరిదన్న ప్రశ్న ఇప్పుడు పోలీసులను వేధిస్తోంది.

More Telugu News