Tej pratap Yadav: భార్య నుంచి విడాకులు తీసుకోబోతున్న లాలూ తనయుడు తేజ్ ప్రతాప్!

  • ఈ ఏడాది మే 12న వివాహం
  • ఆరు నెలలు కూడా తిరక్కుండానే విడాకులు
  • పాట్నా సివిల్ కోర్టులో తేజ్ ప్రతాప్ విడాకుల దరఖాస్తు

రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్-ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకోబోతున్నారా? వివాహమై ఆరు నెలలు కూడా కాకుండానే విడిపోతున్నారా?.. ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నారు తేజ్ ప్రతాప్. ఐశ్వర్వతో తనకు విడాకులు ఇప్పించాల్సిందిగా కోరుతూ పాట్నా సివిల్ కోర్టులో తేజ్ ప్రతాప్ డైవోర్స్ పిటిషన్ దాఖలు చేశారు.

ఇద్దరి మధ్య పొసగకపోవడమే అందుకు కారణమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని తేజ్ ప్రతాప్ తరపు న్యాయవాది యశ్వంత్ కుమార్ శర్మ తెలిపారు. హిందూ వివాహ చట్టం ప్రకారం పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపారు. పిటిషన్ దాఖలు చేసిన అనంతరం రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో ఉన్న తన తండ్రి లాలు ప్రసాద్‌ను తేజ్ ప్రతాప్ కలిశారు.

కాగా, ఐశ్వర్య రాయ్ త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నారన్న వార్త ఇటీవల వైరల్ అయింది. ఈ నేపథ్యంలో విడాకుల కోసం తేజ్ ప్రతాప్ కోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయ కుటుంబానికే చెందిన ఐశ్వర్య వచ్చే ఎన్నికల్లో సరానా నుంచి లోక్‌సభకు పోటీ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఆర్జేడీ నేత చంద్రికా రాయ్ కుమార్తే ఐశ్వర్య రాయ్. బీహార్ మాజీ ముఖ్యమంత్రి అయిన డరోగా ప్రసాద్ రాయ్‌కు ఆమె మనవరాలు.

12 మే 2018లో పాట్నాలో తేజ్ ప్రతాప్-ఐశ్వర్య రాయ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహానికి 10 వేల మంది అతిథులు హాజరయ్యారు.

More Telugu News