Dailyhunt: మోదీకే మా ఓటు.. ప్రధానిగా ఆయనే బెటరంటున్న ప్రజలు.. తాజా సర్వేలో వెల్లడి!

  • అవినీతి నిర్మూలనలో 60 శాతం మంది మోదీకే ఓటు
  • రెండోసారి ప్రధాని కావాలన్న 50 శాతం మంది
  • డైలీ హంట్-నీల్సన్ సర్వేలో వెల్లడి

వచ్చే సారి కూడా మళ్లీ మోదీనే ప్రధాని కావాలని, ఆయనైతేనే దేశం పురోభివృద్ధి సాధిస్తుందని ఓ సర్వేలో వెల్లడైంది. న్యూస్ వెబ్‌సైట్ డైలీ హంట్, డేటా అనలిటిక్స్ సంస్థ నీల్సన్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో 50 శాతం మంది మళ్లీ మోదీనే ప్రధాని కావాలని కోరుకున్నారు. దేశ విదేశాల్లోని దాదాపు 54 లక్షల మంది అభిప్రాయాన్ని సేకరించిన అనంతరం ఈ సర్వేను విడుదల చేశారు. సర్వేలో పాల్గొన్న వారిలో 63 శాతం మంది ఎన్డీయే ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు.  

ఈ సర్వేను నకిలీదిగా కొట్టిపారేసిన కాంగ్రెస్.. ఎన్డీయే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని పేర్కొంది. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదని జోస్యం చెప్పింది. నకిలీ సర్వేలతో ప్రజలను నమ్మించాలని బీజేపీ యోచిస్తోందని  కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా ఆరోపించారు.

కాగా, డైలీహంట్-నీల్సన్ సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువమంది దేశానికి ప్రధానిగా మోదీనే అర్హుడని అభిప్రాయపడ్డారు. సంక్షోభ సమయంలో ఆయనైతేనే దేశాన్ని నడిపించగలడని పేర్కొన్నారు. మోదీ తర్వాతి స్థానంలో 17 శాతంతో రాహుల్ గాంధీ, 8 శాతంతో అరవింద్ కేజ్రివాల్, 3 శాతంతో అఖిలేష్ యాదవ్, 2 శాతంతో మాయవతి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. దేశంలో అవినీతి నిర్మూలన విషయంలో 60 శాతం మంది మోదీకి మద్దతు తెలపగా, మోదీ రెండోసారి ప్రధాని అయితే బాగుంటుందని 50 శాతం మంది అభిప్రాయపడ్డారు.

More Telugu News