Undavalli: కోడికత్తి కేసు.. చంద్రబాబు, జగన్ లపై ఉండవల్లి స్పందన!

  • జగన్ కు తనపై తానే దాడి చేయించుకోవాల్సిన అవసరం లేదు
  • జగన్ పై హత్యాయత్నం జరిగితే చంద్రబాబుకు ఆనందం ఎందుకు ఉంటుంది?
  • అన్ని పార్టీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయి

వైసీపీ అధినేత జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో చేసిన దాడిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. అన్ని పార్టీల నేతలు ఈ విషయాన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆయన విమర్శించారు. మాట్లాడుకోవడానికి రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా... వాటన్నింటినీ వదిలేసి, ఈ దాడిపైనే విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

జగన్ సభలకు జనాలు బాగా వస్తున్నారని, ఈ పరిస్థితుల్లో తనపై తానే దాడి చేయించుకోవాల్సిన అవసరం జగన్ కు లేదని ఉండవల్లి అన్నారు. జగన్ కు ఏమైనా జరిగితే ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుసని, కాబట్టి జగన్ ను హత్య చేయించే పని ఆయన చేయరని చెప్పారు. జగన్ పై హత్యాయత్నం జరిగితే చంద్రబాబుకు ఆనందం ఎందుకుంటుందని ప్రశ్నించారు.

కేసులో నిజాలను పోలీసులు తేలుస్తారని తెలిపారు. నిందితుడికి నార్కో అనాలిసిస్ పరీక్ష చేయిస్తే, వివరాలు బయటకు వస్తాయని చెప్పారు. ఈ విషయంపై అనవసర రాద్ధాంతాన్ని ఆపివేయాలని సూచించారు. దాడి ఘటనపై చంద్రబాబు కూడా అతిగా స్పందించారని విమర్శించారు. 

More Telugu News