tirumala: తిరుమల శ్రీవారి ఆన్ లైన్ టికెట్ల విధానంలో మార్పులు... నేటి నుంచే అమలు!

  • ఒక ఈ-మెయిల్, ఫోన్ నంబర్ కు ఒకే రిజిస్ట్రేషన్
  • ఆధార్ సంఖ్య కూడా తప్పనిసరి
  • అక్రమాలు జరుగుతున్నందునే: సింఘాల్

తిరుమల శ్రీవారి ఆన్ లైన్ సేవా టికెట్ల జారీ విధానంలో నేటి నుంచి కీలక మార్పును అమలు చేయనున్నట్టు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఒక ఈ-మెయిల్, ఒక ఫోన్ నంబర్ నుంచి ఒకే రిజిస్ట్రేషన్ విధానాన్ని నూతనంగా తీసుకు వచ్చామని, ఈ రిజిస్ట్రేషన్ కు ఆధార్ కార్డు వివరాలు తప్పనిసరని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలవుతున్న విధానంలో సేవా టికెట్లు అక్రమార్కుల పాలవుతున్నాయని, పలువురు ఒకే ఫోన్ నంబర్ పై వేర్వేరు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సింఘాల్ వెల్లడించారు. సేవా టికెట్లలో అక్రమాలకు పాల్పడిన భక్తులు, టీటీడీ సిబ్బందిపై క్రిమినల్ కేసులు పెట్టామని ఆయన తెలిపారు.

వచ్చే నెలలో రానున్న వైకుంఠ ఏకాదశికి నవంబర్ 25 నుంచి ఏర్పాట్లు ప్రారంభించనున్నామని భక్తులకు ఇబ్బంది లేకుండా మాడవీధుల్లోనే ఈ దఫా క్యూలైన్ల ఏర్పాటు ఉంటుందని చెప్పారు. మాఢ వీధుల్లో భారీ షెడ్లను ఏర్పాటు చేసి, ప్రశాంత వాతావరణం ఉండేలా చూస్తామని తెలిపారు. డిసెంబర్ 4 నుంచి 12 వరకూ తిరుచానూరులో పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. 12న పంచమీ తీర్థం వేడుక ఉంటుందని తెలిపారు.

More Telugu News