Traffic Police: బైక్ పై వున్న పెండింగ్ చలాన్లు చూసి.. అవాక్కయిన హైదరాబాద్ పోలీసులు!

  • 28 నెలల్లో 136 పెండింగ్ చలాన్ లు
  • రూ. 31,590 పెండింగ్ లో
  • బైక్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు

సాధారణ తనిఖీల్లో భాగంగా, ఓ బైకును ఆపిన పోలీసులు, హెల్మెట్ లేదని చెబుతూ చలాన్ రాస్తూ, పీడీఏ మిషన్ లో పెండింగ్ చలాన్లు ఏమైనా ఉన్నాయేమోనని చూసి అవాక్కయ్యారు. ఆ బైక్ పై 136 పెండింగ్ చలాన్ లు ఉండటమే ఇందుకు కారణం. ఈ ఘటన హైదరాబాద్, నారాయణగూడ పరిధిలో జరిగింది. నిన్న సాయంత్రం వై జంక్షన్ వద్ద తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు, హెల్మెట్ లేకుండా వచ్చిన ఓ వ్యక్తి బైకు (టీఎస్‌10ఈడీ9176)ను ఆపారు. ఆ వాహనంపై గడచిన 28 నెలల్లో 136 చలాన్లు జారీ అయినట్టు గుర్తించారు.

ఇందులో రూ. 29,600 జరిమానా కాగా, రూ. 4,690 సర్వీస్ చార్జ్ ఉండగా, మొత్తం రూ. 31,590 చెల్లించాల్సివుంది. ఈ వాహనం కేకే ప్రకాష్ అనే వ్యక్తిపై రిజిస్టర్ అయి ఉండగా, జూన్ 9, 2016న తొలి చలాన్ జారీ అయింది. ఆపై 127 సార్లు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నందుకు, ఆరు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నందుకు జారీ అయ్యాయి. ఈ బైక్ ను సీజ్ చేసిన పోలీసులు, చలాన్లు చెల్లించిన తరువాతనే బండిని అప్పగిస్తామని తెలుపుతూ, కోర్టులో అభియోగపత్రం నమోదు చేయనున్నట్టు స్పష్టం చేశారు.

More Telugu News