Congress: కర్ణాటకలో బీజేపీకి ఊహించని షాక్.. పోలింగుకు ముందు పార్టీని వీడిన రామనగర అభ్యర్థి.. కాంగ్రెస్‌లో చేరిక!

  • ఉప ఎన్నికల ప్రచారం ముగిసీ ముగియగానే పార్టీని వీడిన అభ్యర్థి
  • కాంగ్రెస్‌లో చేరిన చంద్రశేఖర్
  • ఆగ్రహం వ్యక్తం చేసిన అమిత్ షా

ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజున కర్ణాటకలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. రామనగర అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి ఎల్‌.చంద్రశేఖర్‌ పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత కాసేపటికే బెంగళూరు రూరల్ ఎంపీ డీకే సురేశ్‌తో కలిసి మీడియా ముందుకు వచ్చిన ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ప్రకటించి బీజేపీకి ఝలక్కిచ్చారు. తాను ఇటీవలే బీజేపీలో చేరినా తనను ఎంతగానో ఆదరించి టికెట్ ఇచ్చారని పేర్కొన్న చంద్రశేఖర్.. ప్రచారానికి మాత్రం ఎవరూ రాలేదని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో పోటీకి దిగడం మంచిది కాదనే ఉద్దేశంతోనే పోటీ నుంచి తప్పుకున్నట్టు తెలిపారు. పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయని ఆరోపించారు.
 
ఎన్నికల బరి నుంచి చంద్రశేఖర్ తప్పుకోవడంతోపాటు కాంగ్రెస్‌లో చేరడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు గంటల ముందు ఇలా జరగడమేంటంటూ మండిపడ్డారు. మరోవైపు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ ఇంత నమ్మక ద్రోహం చేస్తారని ఊహించలేదన్నారు. కాగా, ఈ ఘటనపై మాట్లాడేందుకు ముఖ్యమంత్రి కుమారస్వామి నిరాకరించారు.

More Telugu News