Chandrababu: చంద్రబాబు పిలుపులో నిజం ఉంది: అరుణ్ శౌరీ

  • చంద్రబాబు-రాహుల్ కలవడం శుభపరిణామం
  • చంద్రబాబు కీలక పాత్ర పోషించాలి
  • మోదీకి నిద్ర పట్టకపోవచ్చు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీలు కలవడం శుభపరిణామమని కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరీ అన్నారు. ఏపీ భవన్‌లో గురువారం చంద్రబాబును కలిసిన అనంతరం శౌరీ విలేకరులతో మాట్లాడారు. మోదీ దుష్టపాలనకు చరమగీతం పాడేందుకు రాజకీయ పక్షాలు తమ శత్రుత్వాన్ని, విభేదాలను పక్కనపెట్టి కలిసి రావడం శుభపరిణామమన్నారు. అందరూ అదే దారిలో నడవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు విపక్షాలన్నీ కలిసి రావాలన్న చంద్రబాబు పిలుపులో నిజం ఉందన్నారు.

దేశంలోని రాజకీయ నాయకులందరితోనూ చంద్రబాబుకు మంచి సంబంధాలున్నాయని, అద్భుతమైన పాలనా దక్షత ఆయన సొంతమని కితాబిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు ముఖ్య భూమిక పోషిస్తే ఫలితాలు వేరుగా ఉంటాయన్నారు. ఆయనకు విజయం చేకూరాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. చంద్రబాబుతో దేశంలోని రాజకీయ పార్టీలన్నీ చేతులు కలపడం చూసి మోదీకి నిద్రపట్టకపోవచ్చన్నారు. మోదీ పాలన వల్ల దేశం ఎంత ప్రమాదకరంగా తయారైందో తెలుసుకునే వారు శత్రుత్వాన్ని వీడి చేతులు కలిపారని అరుణ్ శౌరీ పేర్కొన్నారు. ఇదో మంచి పరిణామమని అన్నారు.

More Telugu News