vatti vasantha kumar: టీడీపీ-కాంగ్రెస్ లది అపవిత్ర కలయిక.. పార్టీ నుంచి తప్పుకుంటున్నా: కాంగ్రెస్ సీనియర్ నేత వట్టి వసంతకుమార్

  • కాంగ్రెస్-టీడీపీలది అనైతిక కలయిక
  • దీనిని నిరసిస్తూ పార్టీ నుంచి తప్పుకుంటున్నా
  • రాహుల్ చేసిన వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోతున్నా

మాజీ మంత్రి, సీనియర్ నేత వట్టి వసంతకుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన మీడియాకు తెలిపారు. కాంగ్రెస్-టీడీపీలది అనైతిక కలయిక అని, దీనిని నిరసిస్తూ పార్టీ నుంచి తప్పుకుంటున్నానని అన్నారు. 2014లో ఏకపక్షంగా రాష్ట్రాన్ని పునర్విభజన చేసినప్పటికీ, ఏపీలో ఆ పార్టీ బలోపేతానికి తాను ఎంతో నిబద్ధతతో కృషి చేశానని చెప్పారు.

అయితే, ఢిల్లీలో ఈరోజున చంద్రబాబు, రాహుల్ ఇధ్దరూ చెట్టాపట్టాలేసుకుని మీడియా ముందుకొచ్చారని, గతాన్ని మరిచిపోతామని రాహుల్ చేసిన వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. నాడు టీడీపీకి వ్యతిరేకంగా వీధుల్లోకి వెళ్లి పోరాడమని, ఈ రోజున పైస్థాయిలో నాయకులు ఓ నిర్ణయం తీసుకుని వారు కలిస్తే కలవొచ్చు గానీ, కింది స్థాయిలో ఓట్లు బదిలీ కావని, క్షేత్రస్థాయిలో వర్కవుట్ కాదంటూ టీడీపీ-కాంగ్రెస్ పొత్తుపై ఆయన విమర్శలు చేశారు.

విభజన వల్ల ఏపీలో 2.5 శాతానికి తగ్గిన కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్, ఆ తర్వాత 17 శాతం పెరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతోందని చంద్రబాబు ఎన్నోసార్లు చెప్పారని, అందుకే, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తాను బయటకు రావడమంటే, మరో పార్టీలోకి వెళుతున్నట్టు కాదని స్పష్టం చేశారు.

More Telugu News